రంగ్ దే సినిమా రివ్యూ

రివ్యూ : రంగ్ దే
తారాగణం : నితిన్, కీర్తి సురేష్, వెన్నెల కిశోర్, నరేష్, రోహిణి, వినీత్ తదితరులు
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : పిసి శ్రీరామ్
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం : వెంకీ అట్లూరి

భీష్మ వంటి సాలిడ్ హిట్ తర్వాత నితిన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకున్నారు. కానీ ఎక్స్ పర్మంటల్ గా చేసిన చెక్ అని స్పీడ్ కు చెక్ పెట్టింది.
అయినా ఊహించిన పరాజయమే అన్నట్టుగా మరీ ఎక్కువ ఫీల్ కాలేదు నితిన్. కారణం రంగ్ దే. కీర్తితో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేయడంతో వీరి పెయిర్ కు
మంచి స్పందన వచ్చింది. అందుకే రెట్టించిన ఉత్సాహంతో రంగ్ దే కోసం ప్రమోషన్స్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని
ప్రేక్షకుల్లో పెంచే ప్రయత్నం చేశాడు. మరి ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా లేదా అనేది చూద్దాం..

కథ :
అర్జున్(నితిన్) చిన్నతనంలోనే అతని ఇంటి పక్క ఇంట్లోకి అనుపమ(కీర్తి సురేష్) ఫ్యామిలీ వస్తుంది. అను అక్కడికి వచ్చాక.. తన పేరెంట్స్ తనను కాస్త
తక్కువ గారాబం చేస్తున్నారు అనే భావన చిన్నతనంలోనే పడుతుంది అర్జున్ కి. అది రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో అనుపై ఏకంగా ద్వేషం
పెంచుకుంటాడు. ఆమె ఎంత దగ్గర కావాలని చూసినా అతను అంత దూరంగా వెళుతుంటాడు. అలాంటి ఈ ఇద్దరికి అనూహ్యంగా పెళ్లవుతుంది. మరి పెళ్లి
తర్వాత అర్జున్, అనుల మధ్య సఖ్యత కుదిరిందా..? అసలు ఆ ఇద్దరి పెళ్లికి దారి తీసిన సిట్యుయేషన్స్ ఏంటీ అనేది మిగతా కథ..

కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఏముందీ అనిపించక మానదు. కానీ కథలు ఎలా ఉన్నా కథనంతో ఆకట్టుకోవడమే కదా ఏ సినిమా అయినా చేసేది. ఆ
విషయంలోరంగ్ దే కూడా సక్సెస్ అయింది. మరీ క్లిష్టమైన సన్నివేశాలు లేకుండా మాగ్జిమం ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సాగాడు దర్శకుడు వెంకీ
అట్లూరి. సీన్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకున్నాడు. చివరికి ద్వితీయార్థంలో ఎమోషనల్ గా సాగే సన్నివేశాల్లో సైతం దీన్ని మిస్
కాకపోవడం కొంత ఇబ్బంది కలిగించినా ఓవరాల్ గా సినిమా చూస్తోన్న ఆడియన్స్ ను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదనే ఫార్ములాలో వెళ్లాడు. అందుకే
కొన్ని మైనస్ లు ఉన్నా.. ఈ ఎంటర్టైన్మెంట్ లో కొట్టుకుపోయాయి. ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా సెకండ్ హాఫ్ లో మనసులు కలవని
ఆ ఇద్దరి మనసులు కూడా కలుసుకునేందుకు రాసుకున్న సీన్స్ మెప్పిస్తాయి. కన్విన్సింగ్ గానూ అనిపిస్తాయి. తను ద్వేషించే అమ్మాయే తన ఫస్ట్ క్రష్
గా సదరు హీరో ఫీలయ్యేందుకు రాసుకున్న సీన్, ఇందుకోసం వెన్నెల కిశోర్ పాత్రను వాడుకున్న విధానం ఆకట్టుకుంటాయి. అందుకే కుటుంబ
సమేతంగా చూడదగ్గ విధంగా కనిపిస్తుందీ చిత్రం.
నితిన్ కు ఇది టైలర్ మేడ్ రోల్. కీర్తి ఎప్పట్లానే చాలా ఉత్సాహంగా చేసింది. తన కెరీర్ లో ఇది పూర్తి వైవిధ్యమైన పాత్ర. ఈ ఇద్దరి జంటగా చాలా చాలా
బావుంది. ఆ బావుండటాన్ని డబుల్ చేసింది పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. వెన్నెల కిశోర్ పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంటరై నవ్విస్తూనే కథను కీలకమైన
మలుపు తిప్పుతుంది. మొదటి సగంలో అభినవ్ గోమటం, సుహాస్ లు నవ్వులు పంచే పని తీసుకున్నా.. మరీ గొప్ప కామెడీ అయితే కాదు. సీనియర్
నరేష్, రోహిణిలకు ఇలాంటి పాత్ర చేయడం ఎన్నోసారో కూడా చెప్పలేం. అంత రొటీన్ రోల్స్. బట్ కథకు సరిపోయాయి. బ్రహ్మాజీ ఉన్నంత సేపు
నవ్వించాడు. ఒకప్పటి యూత్ ఫుల్ స్టార్ నిత్య యవ్వనుడు వినీత్ చిన్న పాత్రలో ఆకట్టుకుంటాడు. మిగతా అన్నీ రొటీన్ క్యారెక్టర్స్.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం విడుదలకు ముందే హైప్ తెచ్చింది. పాటలు విజువల్ గానూ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పిసి
శ్రీరామ్ గురించి కొత్తగా చెప్పాల్సిందేముందీ.. ఆయన పనితనం సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ మెప్పిస్తుంది. డైలాగ్స్ సిట్యుయేషనల్ గా సింపుల్ గా
ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్ట్స్ లెవల్లో కనిపిస్తాయి. దర్శకుడుగా వెంకీ అట్లూరి ఈ మాత్రం పర్ఫార్మెన్సే ముందు ముందూ చూపిస్తే కుదరదేమో
కానీ.. ఈ కథను మాత్రం పాస్ చేయించే ప్రతిభ చూపించాడు.

ఫైనల్ గా : రంగ్ దే .. ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 3/5

                - యశ్వంత్

Related posts

Leave a Comment