స‌న్ ఆఫ్ ఇండియా సినిమా సమీక్ష

పేరు:
తారాగ‌ణం: మోహ‌న్‌బాబు, ప్ర‌గ్యా జైస్వాల్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీ‌కాంత్‌, మీనా, న‌రేశ్‌, రాజా ర‌వీంద్ర‌, పృథ్వీ, మంగ్లీ, వెన్నెల కిశోర్‌, అలీ, సునీల్‌, బండ్ల గ‌ణేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, ర‌విప్ర‌కాశ్‌, సుప్రీత్‌, టి.ఎన్‌.ఆర్‌.
క‌థ: డైమండ్ ర‌త్న‌బాబు
మాట‌లు: తోట‌ప‌ల్లి సాయినాథ్‌, డైమండ్ ర‌త్న‌బాబు
మ్యూజిక్: ఇళ‌య‌రాజా
సినిమాటోగ్ర‌ఫీ: స‌ర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతంరాజు
ఆర్ట్: చిన్నా
బ్యాన‌ర్స్: ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ
నిర్మాత: మంచు విష్ణు
ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు
విడుద‌ల తేదీ: 18 ఫిబ్ర‌వ‌రి 2022

క‌థ‌
కేంద్ర‌మంత్రి మ‌హేంద్ర భూప‌తి (శ్రీ‌కాంత్‌) కిడ్నాప్‌కు గుర‌వ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టిస్తుంది. దానిపై మీడియా ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తుంది. ఆ కేసును నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ ఆఫీస‌ర్ ఐరావ‌తి (ప్ర‌గ్యా జైస్వాల్‌) టేక‌ప్ చేస్తుంది. ఆ త‌ర్వాత డాక్ట‌ర్ ప్ర‌తిభా లాస్య‌, దేవాదాయ చైర్మ‌న్ (రాజా ర‌వీంద్ర‌) కూడా కిడ్నాప్‌కు గుర‌వ‌డం క‌ల్లోలాన్ని సృష్టిస్తుంది. అప్పుడు తానే ఆ కిడ్నాప్‌లు చేశానంటూ విరూపాక్ష (మోహ‌న్‌బాబు) అనే మ‌ధ్య‌వ‌య‌సు వ్య‌క్తి ఆన్‌లైన్ ద్వారా టీవీ చాన‌ళ్ల‌కు తెలియ‌జేస్తాడు. ఆయ‌న ఎందుకు వారిని కిడ్నాప్ చేశాడు, ఆయ‌న ఆశ‌యం ఏమిటి, ఆస‌లు ఆయ‌న క‌థేమిటి? అనేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
దేశంలోని జైళ్ల‌లో 40 వేల మందికి పైగా నిర‌ప‌రాధులు చేయ‌ని నేరానికి శిక్ష‌లు అనుభ‌విస్తున్నార‌నీ, వాళ్ల‌ను కాపాడి బ‌య‌ట‌కు తీసుకురావాల‌నే సందేశంతో స‌న్ ఆఫ్ ఇండియాను మ‌న ముందు ప్రెజెంట్ చేశాడు ద‌ర్శ‌కుడు డైమండ్ ర‌త్న‌బాబు. నిజానికి ఇది స‌మాజమంతా ప‌ట్టించుకోవాల్సిన పెద్ద స‌మ‌స్య‌. అలా జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న నిర‌ప‌రాధుల కుటుంబాల ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గుండె బ‌రువెక్కుతుంది. వాళ్ల కోసం, వాళ్ల‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం కోసం కంక‌ణం క‌ట్టుకున్న విరూపాక్ష క‌థే ‘స‌న్ ఆఫ్ ఇండియా’.

ఒక ప్ర‌యోజ‌నాత్మ‌క పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ క‌థ‌కు స్క్రీన్‌ప్లే స్వ‌యంగా మోహ‌న్‌బాబు స‌మ‌కూర్చారు. ఏ సినిమాకైనా కీల‌కం స్క్రీన్‌ప్లే, స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌. ఈ సినిమాకి సంబంధించిన ఓ ప్ర‌యోగం చేశారు. సినిమాలో విరూపాక్ష పాత్ర‌, టీవీ యాంక‌ర్లుగా న‌టించిన అలీ, సునీల్‌, వెన్నెల కిశోర్‌, బండ్ల గ‌ణేశ్ పాత్ర‌లు మాత్ర‌మే మ‌నకు క‌నిపిస్తుంటారు. మిగ‌తా పాత్ర‌ధారులంతా వాళ్ల పాత్ర‌ల ముగింపులో మాత్ర‌మే త‌మ ముఖాల్ని మ‌న‌కు చూపిస్తారు.

విరూపాక్ష‌గా మోహ‌న్‌బాబు న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంది! ఈ సినిమాకు ఆయ‌న చెప్పే డైలాగులే ప్రాణం. ఓవ‌ర్‌డోస్ అనిపించ‌కుండా సీన్‌లోని మూడ్‌కు త‌గ్గ‌ట్లు త‌న‌దైన శైలిలో డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్‌ను అల‌రించారు మోహ‌న్‌బాబు. టీవీ న్యూస్ యాంక‌ర్లుగా వెన్నెల కిశోర్, అలీ, సునీల్‌, బండ్ల గ‌ణేశ్ త‌మ‌కు ఇచ్చిన డైలాగ్స్‌ను డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్లు న‌లుగురూ నాలుగు ర‌కాలుగా చెప్పారు. మోహ‌న్ బాబు అభిమానులు త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా.

రేటింగ్ :3/5

Related posts

Leave a Comment