వకీల్ సాబ్ సినిమా రివ్యూ

రివ్యూ : వకీల్ సాబ్
తారాగణం : పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య, వంశీకృష్ణ తదితరులు
సంగీతం : ఎస్ తమన్
నిర్మాతలు : దిల్ రాజు, బోనీకపూర్
దర్శకత్వం : వేణు శ్రీరామ్

మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ కు ఊహించినట్టుగానే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకూ సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన వకీల్ సాబ్ కు అన్ని ఏరియాస్ నుంచి హిట్ టాకే వినిపిస్తుండటం విశేషం. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ కు రీమేక్ గా వచ్చిన వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. మరి వకీల్ సాబ్ ఎలా ఉన్నాడో ఓ సారి చూద్దాం..

స్నేహితులు అని నమ్మి సాయం అడిగితే.. ఓ ముగ్గురు అమ్మాయిలపై వారి ఫ్రెండ్సే అఘాయిత్యం చేయబోతారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఓ ఎమ్.పి కొడుకును కొడుతుంది పల్లవి అనే అమ్మాయి. దీంతో అతను ఆమెపై పగ పెంచుకుని అనుక్షణం ఇబ్బందులు పెడుతుంటాడు. అంతేకాక తనపై హత్యాయత్నం చేసిందని కేస్ కూడా పెడతాడు. ఈ కేస్ లో వారి తరఫున ఎవరూ వాదించడానికి ముందుకు రారు. ఆ టైమ్ లో ఒకప్పటి పెద్ద లాయర్ గా పేరున్న సత్యదేవ్ సాయం తీసుకుంటారు. అతను వీరి కేస్ ను టేకప్ చేసి వారికి న్యాయం చేయడం అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ఈ కథలో తెలుగులో చేసిన మార్పులన్నీ కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా సూపర్ గా వర్కవుట్ అయ్యాయి.

కొన్ని సినిమాలు స్టోరీ డ్రైవెన్ గా ఉంటాయి. వాటికి స్టార్డమ్ అక్కర్లేదు. అలాంటిదే పింక్. ఇలాంటి సినిమాలు రీమేక్ చేయడం అంత సులువు కాదు. పైగా మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఓ టాప్ స్టార్ తో చేయడం అంటే అది స్క్రిప్ట్ మీద సాములాంటిది. ఆ విషయంలో వేణు శ్రీరామ్ కథాబలాన్ని తగ్గించుకుండా పవన్ ఇమేజ్ ను మ్యాచ్ చేస్తూ రాసుకున్న అదనపు స్క్రీన్ ప్లేలో కొన్ని తడబాట్లు కనిపించినా.. ఓవరాల్ గా కథను చెడగొట్టలేదు. పైగా పవన్ ఇమేజ్ ప్లస్ కావడం వల్ల చాలా డైలాగ్స్ విజిల్స్ పడేలా ఉన్నాయి.
ఒరిజినల్ లో తాప్సీ పాత్రను తెలుగులో నివేదా థామస్ చేసింది. తనతో పాటు అంజలి, అనన్య నటించారు. పవన్ ఆవేశం నిండిన పాత్రలో పవన్ అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత కనిపించినా ఆ గ్రేస్ కానీ.. యాటిట్యూడ్ కానీ మారలేదు. పైగా ఇవే సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. ఇక ఈ మూవీలో మరో హైలెట్ అంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ నటనే. ప్రీ రిలీజ్ లో పవన్ చెప్పినట్టు.. ఎదురుగా బలమైన నటుడుంటే మన నటనా ఇంప్రూవ్ అవుతుందన్నట్టుగా.. ప్రకాష్ రాజ్ లోని గొప్ప నటుడుని మరోసారి చూపిస్తుంది వకీల్ సాబ్.
లాంగ్ గ్యాప్ తర్వాత కనిపించిన పవన్ కళ్యాణ్.. తన అభిమానులనే కాదు.. ఇతర ఆడియన్స్ ను సైతం ఆకట్టుకునేలా కనిపించాడు. ఓ మంచి కథకు అదే స్థాయి ఇమేజ్ ఉన్న పవన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇక టెక్నికల్ గానూ సినిమా సూపర్బ్ అనిపిస్తుంది. వేణు శ్రీరామ్ పవన్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథనంలో చేసిన మార్పులు మెప్పిస్తాయి. మొత్తంగా ఈ సమ్మర్ కు వకీల్ సాబ్ వాయిదాల్లేని ఊపును తెచ్చాడనే చెప్పాలి.

            రేటింగ్ : 3/5

Related posts

Leave a Comment