కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్

కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపి మంచి ఫనితాలు ఇస్తున్నందున, కోవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని గవర్నర్ సూచించారు.
సనత్ నగర్ లోని ఈ ఎస్ ఐ మెడికల్ కళాశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ ను గవర్నర్ ఈరోజు సందర్శించారు. అక్కడ కోవిడ్-19 చికిత్స కోసం వారి సన్నద్ధతను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవిడ్ నుండి కోలుకున్న అందరి నుండీ ప్లాస్మా తీసుకోలేమని, కోలుకున్నవారిలో సరైన మొత్తంలో సరిపడా యాంటీబాడీలు ఉన్నవారు మాత్రమే ప్లాస్మా దానానికి అర్హులని డా. తమిళిసై వివరించారు. “ప్లాస్మా దానం పై ఎలాంటి అపోహలు, భయం అవసరం లేదు. ఇది ఆరోగ్యకరమైనదే” అని గవర్నర్ వివరించారు. నేను ఒక గవర్నర్ గా కాదు ప్రజల సేవలో ఒక ఉత్ప్రేరకంగా భావిస్తూ పనిచేస్తానని ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రధమ పౌరురాలిగా కాకుండా సామాన్యులలో ఒకరిగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో ప్రభుత్వానికి, ప్రజలకు వారు చేసే కృషిలో తోడుగా ఉంటానని గవర్నర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కోవిడ్-19 నుండి కోలుకుని ప్లాస్మా దానం చేసిన సంతోష్ అనే వ్యక్తిని గవర్నర్ అభినందించారు.
మెడికల్ కాలేజ్ డీన్ డా. శ్రీనివాసరావు కోవిడ్ నుండి కోలుకుని సేవలందించడంలో ముందుండటంలో ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఎస్ ఐ మెడికల్ కళాశాలలోని ప్లాస్మా బ్యాంక్, ఇతర సౌకర్యాలను గవర్నర్ పరిశీలించారు. క్లిష్ట సమయంలో సేవలందిస్తున్న వైద్యులను, సిబ్బందిని అభినందించారు. కళాశాల రిజిష్ట్రార్ డా. మాధురి ఇతర అధ్యాపకులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment