సౌత్ కోస్ట్ జోన్ గా నామకరణం

ఢిల్లీ : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ ని మంజూరు చేస్తూ ఈరోజు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ 13లోని 8వ ఆర్టికల్ ప్రకారం సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూస్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ గా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని ఈ నూతన రైల్వే జోన్ ప్రకటించారు. మార్చి 1వ తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో దానికి రెండు రోజుల ముందే విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి ప్రకటించడం విశేషం.

రైల్వే జోన్ కి సంబంధించి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఎస్ఈవోఆర్ గా ఈ జోన్ ని పిలుస్తారని చెప్పారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు ఈ జోన్ పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగం నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో విజయవాడ డివిజన్ గా ఉంటుందని తెలిపారు. మిగిలిన భాగాన్ని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ గా కొనసాగుతుందని చెప్పారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లు కొనసాగుతాయని పీయూష్ తెలిపారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందించడం జరుగుతుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

Related posts

Leave a Comment