బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.
గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. పైకి పండ్ల బుట్టలను చూపించి.. ఖాకీలను బురిడీ కొట్టించాలనుకున్నారు. చివరికి ఊసలు లెక్కపెట్టారు. విజయవాడ బోర్డర్ ప్రాంతంలో ఓ చెక్‌పోస్ట్ పెట్టి.. వాహన తనిఖీలు చేస్తోన్న టాస్క్‌ఫోర్స్ అధికారులు.. అటుగా వచ్చే ఒక ఆటో మీద అనుమానం వేసింది. దాన్ని ఆపి చెక్ చేయగా.. బండి మొత్తం పైనాపిల్ బుట్టలు కనిపించాయ్.
అయితే ఆ వాహనాన్ని నడిపే వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉండటంతో.. లోతుగా తనిఖీ చేయగా.. గంజాయి వాసన గుప్పుమంది. నిందితుల నుంచి 180 కేజీల గంజాయి ప్యాకెట్లను, మూడు మొబైల్స్, గంజాయి తరలింపునకు ఉపయోగించిన ఆటోను టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అలాగే ఈ ఘటనలో అడ్డంగా బుక్ అయిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా గోకవరం చెందినవారని.. మరో వ్యక్తి అల్లూరి జిల్లా ధారకొండకు చెందిన అతడని పోలీసులు తెలిపారు. ఏజెన్సీ వైజాగ్ ప్రాంతం నుంచి ఫైన్ ఆపిల్‌తో పాటు గంజాయిని కొనుగోలు చేసి దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో దాచినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అటు నిందితులలో ఒకరు గోకవరం పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న ఫ్రూట్స్ స్టాల్ వ్యాపారిగా అధికారులు కనిపెట్టారు. కాగా, ఈ ఘటనపై ముగ్గురు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.