తునిలో వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఈ చోరీ వెనక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. అమ్మాయిగా మారాలని ఆకాంక్షించిన సతీష్ (అవంతిక రెడ్డి) తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్ సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకోవడానికే ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
కాకినాడ జిల్లా తునిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు వెనుక ఒక ఊహించని స్టోరీ బయటపడింది. ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్న ఆరాటమే ఈ క్రైమ్‌కు కారణమని పోలీసులు తేల్చారు. ఆగస్టు 20న తుని పట్టణంలోని సీతారాంపురం నిమ్మకాయలవారి వీధిలో నివసిస్తున్న వృద్ధురాలు సత్యవతిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఆమె వెనుకవైపు మరుగుదొడ్డికి వెళ్తుండగా నోరు మూసి, కళ్లలో కారం చల్లి బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. షాక్‌కు గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి స్పెషల్ టీం రంగంలోకి దిగింది.
దర్యాప్తులో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సతీష్ అలియాస్ అవంతిక రెడ్డి.. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన ప్రశాంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం సతీష్ తునికి వచ్చి, తనను అవంతిక రెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. స్థానిక హిజ్రాలతో కలసి విటుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. తునిలో ఒక ఇంట్లో భార్యాభర్తలుగా అద్దెకు కూడా దిగారు.
అవంతిక రెడ్డి తన లైంగిక గుర్తింపును మార్చుకోవాలని నిర్ణయించి.. ముంబైలో సర్జరీ చేయించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.5 లక్షలు అవసరం. ఆ డబ్బు కోసం చోరీ చేయాలని నిర్ణయించుకున్న ఈ జంట.. వృద్ధురాలు సత్యవతి ఇంటిని టార్గెట్ చేశారు. దాడి సమయంలో వాడిన పేపరు ముక్కను అక్కడే పడేసి వెళ్లడం.. నిందితులు దొరికిపోయారు. పోలీసులు ఆ ఆధారంతో అనుమానితుల ఇంట్లో సోదాలు చేయగా.. అదే పేపరు ముక్కకు సరిపోయే మిగతా భాగం దొరికింది. ఇతర సాక్ష్యాలు కలిపి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.