వినాయక చవితి సందర్భంగా గణేశ్ నిమజ్జనం రోజున ఏర్పాటు చేసిన ఊరేగింపు ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఊరేగింపులో డీజే సౌండ్స్ తో డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి మృతి చెందాడు. హైదరాబాద్‌లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న యువకుడు.. వినాయకచవితి పండుగకు వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా ఘొల్లుమంది..
గణేష్ చతుర్దీ అంటేనే.. కుర్ర కారు జోష్‌కు పట్టపగ్గాలు ఉండవ్.. చవితి మొదలు నిమజ్జనం వరకు ధూం ధాం చేసేస్తారు. డీజే సౌండ్స్‌తో వీధులన్నీ మారుమోగిపోతాయ్.. ఇక యువకులు గణేష్ విగ్రహం ముందు డీజే పాటలకు ధీటుగా స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ఇదే మాదిరి వినాయకుడి ముందు డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిపోయాడు. పరిమితికిమించి పెట్టిన డీజే సౌండ్స్‌కు సదరు యువకుడి గుండె ఆగిపోయింది. దీంతో ఊరంతా విషాదఛాయలు అలముకున్నాయి. విజయనగరం జిల్లాలోని బొబ్బాదిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
విజయనగరం జిల్లాలోని బొబ్బాదిపేటలో బుధవారం (సెప్టెంబర్ 3) రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా బొబ్బాది హరీశ్ (22) అనే యువకుడు డీజే ముందు డ్యాన్స్ చేశాడు. వినాయక ఊరేగింపులో డీజే సౌండ్స్ శబ్దానికి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు అతడిని హుటాహుటీన సమీపంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీశ్ హైదరాబాద్‌లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. గత కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే వినాయక చవితి సందర్భంగా ఊరొచ్చిన హరీశ్… ప్రాణాలు కోల్పోవడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
పండగ తర్వాత హైదరాబాద్ వెళ్లేందుకు ట్రైన్ టికెట్లు కూడా రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా అందరి ముందూ డ్యాన్స్ చేసిన హరీశ్ కళ్లముందే ప్రాణాలు వదడంతో బొబ్బాదిపేటలో విషాద చాయలు అలముకున్నాయి. గుండె పోటు వచ్చేంతగా సౌండ్స్ పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారని, డీజేలను నిషేధిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని పలువురు సూచిస్తున్నారు.