బెజవాడ దుర్గమకు భక్తులు భారీ సంఖ్యలో కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో దుర్గమ్మ బంగారాన్ని అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.5 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. అంతేకాకుండా భక్తులకు మరో గుడ్ న్యూస్‌ను కూడా ఆలయ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కలు చెల్లించుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేశారు. 29.510 కిలోల బంగారాన్ని అధికారులు ఎస్‌బీఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. దీని విలువ గ్రాముకు రూ.9,010 రేటు చొప్పున 26.05 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇవి 22 క్యారెట్ల బంగారం కాగా.. దీనిపై ఏడాదికి 0.60శాతం వడ్డీ వస్తుందని ఈవో వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లతో బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు.
మరోవైపు అమ్మవారికి సేవ చేయాలనుకునే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సేవ చేయాలనుకునేవారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక ఆఫీసును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా త్వరలోనే ఆన్‌లైన్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు. అర్జిత సేవలు, భక్తులకు అన్నప్రసాదం, క్యూలైన్లు, పార్కింగ్, సామాన్ల గదులు వంటి వాటి దగ్గర అధికారులు వీరి సేవలను ఉపయోగించుకోనున్నారు. రూల్స్ ప్రకారం.. సేవ చేసేవారిని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.