గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం వంశీ శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతుండటంతో.. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వంశీ ఉదయం కోర్టుకు హాజరైన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వంశీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వల్లభనేని వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని.. కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. దీనిపై అధికారికంగా వైద్యులు ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
కాగా.. ఫిబ్రవరి13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఆతర్వాత ఆయనపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సహా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన 11 కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బెయిల్ రద్దుకు నో చెప్పింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష నగదు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో పాటు వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కి రావాలనే కండీషన్‌తో బెయిల్ మంజూరు చేసింది.