సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET 2025) జూన్ 2025 పరీక్ష తేదీ మారింది. ఈ మేరకు పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చి షెడ్యూల్ ప్రకారం.. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు జులై 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సింది ఉంది. అయితే అదే రోజు హరియాణా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (HTET 2025) ఉన్నట్లు తేలింది. దీంతో ఒకే రోజున రెండు పరీక్షలు ఉండటంతో కొందరు అభ్యర్ధులు పరీక్ష తేదీని మార్చాలంటూ ఎన్టీయేకు విజ్ఞప్తులు చేశారు. వీరి అభ్యర్ధులను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీయే.. ఈ పరీక్ష యూజీసీ నెట్ పరీక్షను కేవలం జులై 28వ తేదీన ఒకే రోజులో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఎన్టీయే ప్రకటించింది. అంటే జులై 28వ తేదీన కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్.. అన్ని సబ్జెక్టులకు ఒకే రోజున పరీక్ష జరగనుంది.
కాగా సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించేందుకు జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష.. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్. దీని యేటా రెండు సార్లు నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జేఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారు యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు. పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు ఎగ్జామ్‌కు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఆ తర్వాత పరీక్షకు నాలుగు రోజులు ముందుగా అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతామని ఎన్టీయే తన ప్రకటనలో తెలిపింది.
కాగా యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారినందున విద్యార్ధులు తమ ప్రిపరేషన్ వ్యూహాన్ని సర్దుబాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష ఒకే రోజులో ఉన్నందున, తమ సబ్జెక్ట్‌కు సంబంధించి పూర్తిగా సిద్ధంగా ఉండాలని, వేగం – ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలని సూచిస్తున్నారు.