నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం… గత సమావేశాల్లో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్ష

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన అజెండాగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీల్లో 327 నిర్ణయాలు తీసుకున్నారు. వీటిల్లో ఎన్ని అమలయ్యాయి.. ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్‌గా ఫోకస్‌ పెట్టనుంది కేబినెట్‌. ఆలస్యమైన నిర్ణయానికి బాధ్యులెవరు? అమలులో ఎందుకు జాప్యం జరుగుతోంది.. అసలు కార్యాచరణ మొదలుపెట్టారా లేదా.. ఇలా అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

మంత్రి దగ్గర నుంచి అధికారుల వరకు ఎవరి దగ్గర సమస్య ఉందో దానిపై యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ రూపొందించనున్నారు సీఎం. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ సవరణ చట్టం, ఉద్యోగాల భర్తీ, రేషన్‌ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం, మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు..తదితర అంశాలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

గత సమావేశంలో ప్రతి మూడు నెలలకోసారి క్యాబినెట్‌ సమావేశాన్ని ‘స్టేటస్‌ రిపోర్ట్‌ మీటింగ్‌’గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గత సమావేశాల ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌’ను ఈ భేటీలో సమర్పించి చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే, పంచాయతీ రాజ్ చట్టం 2018ని ప్రభుత్వం సవరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ఇటీవలే పంచాయతీ రాజ్- 2025 చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ద్వారా రేవంత్ సర్కార్ ఆమోదింపజేసింది. ఇందులో 23.81 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ చట్టాన్ని సవరించారు.

అయితే, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటుతుండటంతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపడం జరిగింది. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితేనే తప్ప 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడం సాధ్యం కాదు. ఇటీవలే ప్రభుత్వం కుల గణన సర్వే నిర్వహించి ఆ వివరాలను బయటపెట్టింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ఈ రిజర్వేషన్ల అమలు ఎలా, స్థానిక సంస్థలను ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశాలపైనే ప్రధానంగా రాష్ట్ర మంత్రివర్గం చర్చ చేయనుంది.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరగవచ్చు. వరద ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేయడం, అవసరమైన సహాయక చర్యల ప్రణాళికలు, విపత్తు నిర్వహణ యాక్షన్ ప్లాన్, సహాయక బృందాల సన్నద్ధత వంటి అంశాలపైన మంత్రివర్గం చర్చ చేయనుంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *