రాత్రి 10 గంటలకే నిద్రపోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది. బరువు నియంత్రణకు, మానసిక ప్రశాంతతకు ఇది ఓ అద్భుత మార్గం. ఈ అలవాటు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మన జీవితంలో నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. చాలా మంది నిద్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పనిలో మునిగిపోయి.. స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం నిద్ర పట్ల అలసత్వం పెంచింది. కానీ ప్రతిరోజు రాత్రి 10 గంటలకే నిద్ర పోవడం శరీరానికి, మనస్సుకు చాలా మంచిది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం
సరైన సమయానికి నిద్రపోతే శరీరంలోని అన్ని వ్యవస్థలు సమతుల్యంగా పని చేస్తాయి. రాత్రి 10 గంటలకు నిద్ర పోవడం వల్ల గుండె వేగం అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అవుతుంది. ఒత్తిడి తగ్గించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు స్థిరంగా ఉండటంతో మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
రోగనిరోధక శక్తి
సరైన సమయానికి నిద్రపోతే మన శరీరంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది. దీని వల్ల మన శరీరం వైరస్ లు, బ్యాక్టీరియాలతో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. సరిపడా నిద్ర లేకపోతే.. మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అప్పుడు చిన్న జబ్బులు కూడా మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.
బరువు నియంత్రణ
సరిగా నిద్రపోకపోతే అది మన ఆకలిని, తినే అలవాట్లను ప్రభావితం చేస్తుంది. మీరు ఆలస్యంగా నిద్రపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల రాత్రిపూట ఎక్కువగా తినే అలవాటు ఏర్పడి.. బరువు పెరగడానికి దారి తీస్తుంది. మీరు రాత్రి 10 గంటలకే నిద్రపోతే ఈ సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మెటబాలిజం బాగా పనిచేస్తుంది. కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి.
మానసిక ప్రశాంతత
సరైన సమయానికి నిద్రపోవడం మన మానసిక ఆరోగ్యానికి ఒక పెద్ద వరం. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు మొత్తం కష్టపడిన తర్వాత సరైన వేళకి నిద్రపోతే.. మనసు పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. దీని వల్ల మరుసటి రోజు ఉదయం మనం శక్తిగా మేల్కొని.. పనుల్లో మరింత శ్రద్ధ పెట్టగలుగుతాము.
నిద్రకు ప్రాధాన్యత
నిద్రకు గౌరవం ఇవ్వడం ఒక మంచి అలవాటు. ఇది క్రమశిక్షణను పెంచుతుంది. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడం వల్ల శరీరానికి ఒక నైజం ఏర్పడుతుంది. ఇది డిజిటల్ డిటాక్స్ కు కూడా సహాయపడుతుంది. అంటే ఫోన్, టీవీ లాంటివి వాడకుండా ఉండటానికి ఇది మంచి మార్గం.
రాత్రి 10 గంటలకే పడుకోవడం ఒక చిన్న మార్పులా కనిపించవచ్చు. కానీ దీని ప్రభావం చాలా గొప్పది. ఈ రోజు నుంచే దీన్ని పాటిస్తే.. మీ ఆరోగ్యంలో మంచి మార్పులు కచ్చితంగా కనిపిస్తాయి.