రెండున్నరేళ్ల లక్షిత్ అనే చిన్నారి రెండు రోజులుగా కనిపించకుండా పోయి, చివరకు మృతదేహంగా కనిపించాడు. అంగన్వాడీ కేంద్రం నుండి పోయిన లక్షిత్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. ఆహార, నీటి లేమితో అతడు మృతి చెందినట్లు అంచనా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ల చిన్నారి లక్షిత్ చివరకు మృతదేహంగా కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎలా జరిగింది?
రెండు రోజుల క్రితం చిన్నారి లక్షిత్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన తర్వాత కనిపించలేదు. అంగన్వాడీ సెంటర్ నుంచి బయలుదేరిన లక్షిత్ తిరిగి ఇంటికి రాలేదు. అప్పటినుంచి ఆందోళనలో ఉన్న కుటుంబం, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఆచూకీ కోసం ప్రత్యేక బలగాలు
లక్షిత్ ఆచూకీ కోసం డాగ్ స్క్వాడ్ సాయంతో ట్రాకింగ్, డ్రోన్ల ద్వారా గాలింపు చేపట్టిన పోలీసులు, అడవిలో ప్రయాణించి ఆహార, నీటి లేమితో మృతి చెందినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. అంగన్‌వాడీ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ప్రత్యేక దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.