HCA అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి 12 రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్‌గిరి కోర్టు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2024 మే కంటే ముందు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఘటనలకు సంబంధించి తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ 9న ఫిర్యాదు చేశారు. HCA ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు, తప్పుడు అటెస్టెడ్ సంతకాలు ఉపయోగించాడు జగన్మోహన్‌రావు. HCAలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు CID గుర్తించింది. SRHతో వివాదం తర్వాత ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విచారణ రిపోర్టును సీఐడికి అందజేశారు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రావుపై 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
రిమాండ్ రిపోర్ట్‌లో మరిన్ని కీలక విషయాలు ఉన్నాయి. జగన్మోహన్‌రావు గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని ఆరోపణలున్నాయి. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో క్లబ్ యజమాని సంతకాలు సరిపోలడం లేదు. సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సీఐడీకి లభించాయి. HCAలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్దతులు నిధుల దుర్వినియోగాన్ని వెలుగులోకి తెచ్చిన సీఐడీ… BCCI నిధులను దుర్వినియోగం చేసినట్టు గుర్తించింది.
ఈ కేసులో ఏ1గా జగన్మోహన్‌రావు, ఏ3గా శ్రీనివాసరావు, ఏ4గా సునీల్, ఏ5గా రాజేందర్, ఏ6గా జి.కవిత ఉన్నారు. శ్రీ చక్రక్లబ్‌కు గౌలిపుర క్రికెట్ క్లబ్ అని కూడా పేరు ఉంది. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో CID అధికారులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ చేసిన గౌలిపుర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ల ద్వారానే జగన్మోహన్ రావు HCAలోకి అడుగుపెట్టారు. అప్పట్లోనే జగన్మోహన్ రావు పోటీ చేయడాన్ని మిగతా సభ్యులు వ్యతిరేకించినప్పటికీ అధ్యక్షుడు కాకుండా ఆపలేకపోయారు.
బీసీసీఐ నిధులు స్వాహా చేయడంతో పాటు కోర్టులో జగన్మోహన్ రావు పలు పిటిషన్లు వేయించడమే కాకుండా ప్రతివాదులు ఓడిపోయేలా కూడా డబ్బులు పంపుతాడన్న ఆరోపణలు ఉన్నాయి. సపోర్ట్‌గా ఉండేందుకు అనేక క్రికెట్ క్లబ్‌లకు డబ్బు చెల్లించారని చెప్తున్నారు. మొత్తంగా జగన్మోహన్ రావు చేసిన అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.