చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట బాగా పండిందనే సంతోషమే వారిలో కనిపించడం లేదు. ఎందుకంటే మామిడి ధర పతనమవడం వారిని కలవరపెడుతుంది. అటు ప్రభుత్వం కూడా అరకొరగానే వారి సమస్యను పట్టించుకోవడంతో మామిడికి మద్ధతు ధర గాలిలో దీపంలా మారింది.
మామిడి ధర.. ఇప్పుడు రచ్చగా మారింది. ఏపీలో రాజకీయాన్ని రంజుగా మార్చింది. మద్దతు ధర అందకపోవడంతో రోడ్డెక్కిన రైతాంగం సమస్య రాజకీయ రంగు పులుముకుంది. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మామిడి ధర పతనానికి అసలు కారణమేంటి. మామిడి రైతుకు ఎందుకింత కష్టం వచ్చిందన్న దానికంటే మ్యాంగో ఫైట్ చేస్తున్న పొలిటికల్ పార్టీలదే పెద్ద సమస్యగా మారింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లే… చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం కష్టాలకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా మామిడి ధరలు పతనం కావడంతో కంటతడి పెడుతున్న రైతాంగం పండిన పంటను అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పాటు ఈ ఏడాది దిగుబడి అమాంతంగా పెరగడంతో మామిడి కొనేవారు కరువయ్యారు. దీంతో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతాంగం సమస్య రాజకీయ అస్త్రంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోగా రైతుకు మాత్రం తీపి పంట చేదుగానే మిగిలిపోయింది. అసలు ఈ ఏడాది ఎందుకు మామిడి రైత కు ఎప్పుడూ లేనంత కష్టం వచ్చిందన్న విషయాలను ఆరా తీస్తే అనేక కారణాలు వెలుగు చూస్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడిపై ఉద్యానవన శాఖ ఇస్తున్న లెక్కలను పరిశీలిస్తే కారణాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో 56 వేల హెక్టార్లలో మామిడి సాగు జరగా ఈ ఏడాది దిగుబడి 8.40 లక్షల టన్నుల మామిడి దిగుబడి జరిగింది. గతేడాది 56 వేల హెక్టార్ల లోనే మామిడి సాగు ఉండగా దిగుబడి మాత్రం దాదాపు 3.35 లక్షల టన్నులు దిగుబడి వచ్చింది. అంటే గతేడాది హెక్టార్‌కు 6 టన్నుల మామిడి దిగుబడి రాగా, ఈ ఏడాది హెక్టారు కు 15 టన్నుల మామిడి దిగుబడి అయింది. రైతు ఊహించనంత దిగుబడి రావడానికి వాతావరణ పరిస్థితులు కూడా ఏడాది అనుకూలించాయి. మరోవైపు ఏప్రిల్ మే వరకు వర్షాలు రావడంతో మామిడి సైజు విపరీతంగా పెరిగింది. మామూలుగా 350 నుంచి 400 గ్రాముల బరువు తో దిగుబడి వచ్చే మామిడి ఈ ఏడాది 700 నుంచి 750 గ్రాముల వరకు కాయ సైజు పెరిగింది. దీంతో హెక్టారుకు రెండింతల నుంచి మూడింతల దాకా దిగుబడి పెరిగింది.
ఇక మామిడి ధర విషయంలోనూ గతేడాదికి ఏడాది ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. గతేడాది టన్ను తోతాపూరి మామిడి రకం రూ. 22 నుంచి 26 వేల దాకా రైతులకు లభించింది. అయితే ఈ ఏడాది టన్ను ధర రూ. 10 వేలు కూడా అందరి పరిస్థితి నెలకొంది. పల్ప్ పరిశ్రమలు టన్నుకు రూ. 6 వేల దాకా ఇస్తుంటే ప్రభుత్వం ప్రోత్సాహక ధరగా టన్నుకు రూ.4 వేలు చెల్లిస్తోంది. ఈ లెక్కన టన్ను తోతాపూరి మామిడి కి రూ. 10 వేలు ధర దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చిత్తూరు జిల్లాలో మార్కెట్ యార్డ్ల వద్ద ర్యాంప్‌లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు టన్ను ధర రూ.3 వేలకు మించి ఇవ్వక పోవడంతో రైతుకు గిట్టుబాటు ధర అందడం లేదు. మరోవైపు పల్ప్ యాజమాన్యాలు టన్ను మామిడికి రూ. 8 వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. నష్టాలను సాకుగా చూపి టన్ను కు రూ.6 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే రేటు కూడా ఇచ్చి కొనుగోలు చేయని పల్ప్ యాజమాన్యాల తీరు రైతులకు సంకటంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక ధర కూడా రైతుల ఖాతాలకు చేరకపోవడంతో రైతుకు మద్దతు ధర గాలిలో దీపంగా మారింది.
ఇక మరో కారణం రాష్ట్రంలో అన్నిచోట్ల ఒకేసారి మామిడి సీజన్ ప్రారంభం కావడం. గతేడాది ముందుగా కృష్ణ ఆ తరువాత ఇతర జిల్లాల నుంచి మామిడి దిగుబడి రాగా ఈ ఏడాది అంతటా ఒకేసారి మామిడి రైతు చేతికి అందింది. ఇక ఈ ఏడాది మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలపైనా అనేక విమర్శలు రాగా మామిడి రైతుకు సరైన ధర లభించక పోవడానికి పల్ప్ యూనిట్ యాజమాన్యాలు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 44 పల్ప్ ప్రాసెస్ యూనిట్లు ఉండగా ఈ ఏడాది 39 యూనిట్లు మాత్రమే మామిడి గుజ్జు తయారీ చేశాయి. గతేడాది పల్ప్ పరిశ్రమల్లో తయారైన మామిడి గుజ్జు ఎక్స్పోర్ట్ కాకపోవడంతో పెద్ద ఎత్తున నిల్వలు ఉండడం కూడా ఒక కారణం అయ్యింది. రూ. కోట్ల విలువచేసే పల్ప్ పరిశ్రమంలోనే ఉండిపోవడంతో ఈ ఏడాది ప్రాసెస్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ఏటా మే 20 తరువాత పల్ప్ యూనిట్లు ప్రాసెసింగ్ ప్రారంభిస్తుండగా ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా జూన్ 7 న గుజ్జు పరిశ్రమలు తెరుచుకున్నాయి. దీంతో ఒకేసారి మామిడి దిగుబడి రావడం, రైతులు పల్ప్ ఇండస్ట్రీస్ కు మామిడిని విక్రయించేందుకు ప్రయత్నం చేయడంతో గందరగోళం నెలకొంది. దిగుబడికి తగ్గట్టుగా డిమాండ్ లేకపోవడం కూడా సమస్యగా మారిపోయింది.
చిత్తూరు జిల్లాలో ఇప్పటిదాకా 2.42 లక్షల టన్నుల మామిడి పల్ప్ యూనిట్లు కొనుగోలు చేయగా ఇంకా పొలాల్లోనే 1.48 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉండిపోయింది. జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. మరో రెండు వారాల్లో మామిడి సీజన్ ముగుస్తుండగా.. ఇప్పటికీ పల్ప్ పరిశ్రమల వద్ద అమ్మకానికి మామిడి ట్రాక్టర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. మద్దతు ధర ఎందుకు ఇవ్వలేదు, మామిడి కొనుగోలులో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే గతంలో ఎప్పుడూ లేనట్లు మామిడి రైతుకు ప్రోత్సాహక ధర కల్పించిన ప్రభుత్వం తమదని టిడిపి చెబుతోంది. అధికార విపక్షాల మధ్య మ్యాంగో వార్ పీక్స్ కు చేరుకుంటుండగా మద్దతు ధర విషయంలో మాత్రం మామిడి రైతులకు సమస్య గానే మిగిలింది.