తెలంగాణలో భూసంబంధిత సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి లైసెన్స్‌డు సర్వేయర్లను, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమించనున్నట్టు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ అధికారిని (జీపీవో), ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరు మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు నియమించనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు ఈ నెల 27న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జేఎన్‌టియు ఆధ్వర్యంలో 28, 29 తేదీల్లో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాలను ఆగస్టు 12న ప్రకటిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని తెలిపారు.
దరఖాస్తుల వెల్లువ: 10 వేల మందికి శిక్షణ
లైసెన్స్‌డ్ సర్వేయర్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా 10 వేల మంది అభ్యర్థులు స్పందించారు. వీరిలో మే 26 నుంచి మొదటి విడతగా 7 వేల మందికి శిక్షణ ప్రారంభమైంది. ఈ నెల 26తో వీరికి 50 రోజుల శిక్షణ పూర్తవుతుంది. మిగిలిన 3 వేల మందికి ఆగస్టు రెండో వారం నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మరోవైపు విఆర్వో, వీఆర్‌ఏలకు అవకాశం కల్పించానే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారు. రెవెన్యూ సంఘాల అభ్యర్థనపై మళ్లీ ఈ నెల 27న మరోసారి అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.
నక్షా లేని గ్రామాల్లో రీసర్వే విజయవంతం
గతంలో మానవయంతంగా మినహాయించిన 413 నక్షా లేని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే విజయవంతంగా పూర్తయింది. సలార్ నగర్ (మహబూబ్‌నగర్), కొమ్మనాపల్లి (జగిత్యాల్), ములుగుమడ (ఖమ్మం), నూగూరు (ములుగు), షాహిద్ నగర్ (సంగారెడ్డి) గ్రామాల్లో మొత్తం 2,988 ఎకరాల్లో భౌతిక సర్వేను అధికారులు నిర్వహించారు. రైతుల సమక్షంలో, ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఈ ప్రక్రియ ముగిసినట్టు మంత్రి తెలిపారు. దీనివల్ల భూములపై స్పష్టత, యాజమాన్యంలో పారదర్శకత, భూ వివాదాల పరిష్కారానికి మార్గం ఏర్పడనుంది. మిగిలిన గ్రామాల్లో కూడా రీసర్వే చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
అవినాభావ సంబంధం: రెవెన్యూ-సర్వే విభాగాలు
సర్వే విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా రెవెన్యూ సేవల మెరుగుదలకు దోహదపడుతుందన్న మంత్రి.. గత పది సంవత్సరాల్లో ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రారంభించిన ఈ నూతన దిశలో అడుగులు, భవిష్యత్‌లో భూసంబంధిత సేవలను, సమస్యలను పరిష్కరించేందుకు సహాయపడుతాయన్నారు.