ఇక నుంచి రైళ్లలో ఏం జరిగినా తెలిసిపోతుంది.. రాత్రి వేళల్లో కూడా.. ఎలానో తెలుసా?

సాధారణంగా పట్టణాల్లో ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు ఈజీగా వాళ్లను పట్టుకుంటారు. కానీ రైళ్లలో దొంగతనాలు జరిగితే వాళ్లను పట్టుకొవడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో ప్రయాణికులు పొగొట్టుకున్న వాటిని తిరిగి రికవరీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువ. అందుకే ఈ సమస్యకు చెక్‌పెట్టేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రైన్స్‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. వీటి సహాయంతో ట్రైన్‌లలో దోపిడీలకు పాల్పడే వారిని గుర్తించొచ్చని రైల్వేశాఖ భావిస్తోంది.

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో దోపిడీ దొంగల బీభత్సం. ప్రయాణికులను బెదిరించి నగలు, నగదు దోపిడీ.” ఇలాంటి వార్తలు తరచుగా చూస్తుంటాం. లేదంటే తోటి ప్రయాణికులకు మత్తు మందు కలిపిన ఆహార పదార్థాలు ఆఫర్ చేసి, మత్తులో ఉండగా నిలువు దోపిడీ చేసిన మాయగాళ్లు అనే తరహా వార్తలైనా చదువుతూ ఉంటాం. ఈ రెండూ కాకపోతే సీటు కోసం ఘర్షణ, దాడులు లేదా రైల్వే TTE పై ప్రయాణికుల దాడి.. ఇలా ఎన్నో రకాల ఘటనలు, ఉదంతాలు అను నిత్యం రైళ్లలో జరుగుతుంటాయి. వీటిపై కేసులు కూడా నమోదవుతుంటాయి. కానీ వాటిని దర్యాప్తు చేయడం రైల్వే పోలీసులకు సవాలుగా మారుతుంది. రైలును ఆపి దిగిపోయే నేరగాళ్లను పట్టుకోవడం మాట పక్కనపెట్టి, కనీసం గుర్తించడమే గగనమైపోతుంది. మరెక్కడైనా జరిగే నేరాల్లో పోలీసులు ఇట్టే నేరగాళ్లను పట్టుకుంటున్నప్పుడు, రైల్వే పోలీసులకు ఇదెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే నగరాలు, పట్టణాలను దాటి ఈ మధ్య కాలంలో మారుమూల గ్రామాల్లోనూ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయడం వల్ల పోలీసుల దర్యాప్తులో సగం పని ఆ సీసీటీవీ ఫుటేజి చేసి పెడుతోంది. కానీ కదిలే రైళ్లలో సీసీటీవీ కెమేరాలు లేకపోవడమే పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పుడు రైల్వేశాఖ ఆ తలనొప్పికి మందుగా… ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతికోచ్‌లోనూ సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడు తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లలో ఏర్పాటు చేసి పరీక్షించింది. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో రైల్వే అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను స్థాపించాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తుందని రైల్వే శాఖ భావిస్తోంది. దోపిడీ దొంగలు, క్రిమినల్ గ్యాంగ్స్ అమాయక ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని తరచుగా దోపిడీలకు పాల్పడుతున్న నేపథ్యంలో కెమెరాల ఏర్పాటు ఈ తరహా నేరాలను అదుపు చేస్తాయని భావిస్తోంది. ప్రయాణికుల గోప్యతను కాపాడేందుకు, సీసీటీవీ కెమెరాలను కోచ్‌లలోని సాధారణ కదలిక ప్రాంతాలైన ద్వారాల సమీపంలో ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఆ శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు, లోకోమోటివ్‌లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. ఈ సమావేశంలో రైల్వే బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

360-డిగ్రీ కవరేజ్

నార్తర్న్ రైల్వే లోకో ఇంజన్లు, కోచ్‌లలో నిర్వహించిన ప్రయోగాలు విజయవంతమైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రి 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌ (ఇంజన్)లలో సీసీటీవీ కెమెరాలను స్థాపించేందుకు ఆమోదం తెలిపారు. ప్రతి రైల్వే కోచ్‌లో 4 డోమ్ రకం సీసీటీవీ కెమెరాలు – ప్రతి ద్వారం వద్ద 2 కెమెరాలు , ప్రతి లోకోమోటివ్‌లో 6 కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో లోకోమోటివ్ ముందు, వెనుక రెండు వైపులా ఒక్కో కెమెరా, అలాగే ప్రతి క్యాబ్ ముందు వెనుక ఒక డోమ్ సీసీటీవీ కెమెరా, రెండు డెస్క్ మౌంటెడ్ మైక్రోఫోన్‌లు ఉంటాయి.

ఆధునిక సమస్యలకు ఆధునిక నిఘా

సీసీటీవీ కెమెరాలు తాజా స్పెసిఫికేషన్‌లతో STQC ధృవీకరణ పొందినవిగా ఉంటాయని అధికారులు తెలిపారు. హై-క్వాలిటీ పరికరాలను ఉపయోగించాలని కేంద్ర రైల్వే మంత్రి నొక్కిచెప్పారు. 100 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో, తక్కువ వెలుతురు కలిగిన పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత గల ఫుటేజ్ అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా సేకరించిన డేటాపై ఇండియా AI మిషన్‌తో కలిసి AI ఉపయోగాన్ని అన్వేషించాలని మంత్రి అధికారులను ప్రోత్సహించారు.

డేటా గోప్యత ప్రధానం

కోచ్‌లలోని సాధారణ కదలిక ప్రాంతాల్లో కెమెరాలను స్థాపించడం ద్వారా ప్రయాణికుల భద్రత, రక్షణను మెరుగుపడుతుంది. అదే సమయంలో గోప్యతను కాపాడుతూనే, ఈ కెమెరాలు దుండగులను గుర్తించడంలో సహాయపడతాయని రైల్వే శాఖ చెబుతోంది. ఈ చర్య కేవలం రైళ్లలో జరిగే నేరాలను మాత్రమే కాదు, ఎక్కడెక్కడో నేరాలు చేసి రైళ్లలో పారిపోయే ప్రయాణికులను గుర్తించడంలోనూ సీసీ ఫుటేజి దోహదపడనుంది.

About Kadam

Check Also

అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.  అందరూ అంత సంతోషం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *