కష్టపడి పనిచేసి మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామనే సమయానికి వారిని మృత్యువు వెంటాడింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో దానిపై ఉన్న కూలీలు అంతా లారీ కింద పడ్జారు. వారిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లి నుంచి మామిడికాయల లోడుతో రైల్వేకోడూరు మార్కెట్ యార్డుకు వెళుతున్న ఐచర్ వాహనం అన్నమయ్య జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లి లోని చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న మొత్తం 22 మందిలో ఏడుగురు స్పాట్లో చనిపోగా ఒక వ్యక్తి రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. లారీలో ఉన్న వారిలో శెట్టిపల్లికు చెందిన 19 మంది కూలీలు వారితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
డ్రైవర్ టర్నింగ్ తీసుకునే సమయంలో ఒక్కసారిగా లారీ టర్న్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గాయపడిన కూలీలు చెబుతున్నారు. గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు కూలీలకు, ఇద్దరు చిన్నారులకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన లారీ డ్రైవర్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు లారీ కింద ఉన్న మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీయడానికి వెంటనే అక్కడికి జెసిబి ను రప్పించి లారీని పైకి లాగి సహాయక చర్యలు చేపట్టారు.
మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిపల్లె గ్రామంలోని హరిజనవాడకు చెందిన వారిగా గుర్తించారు. అయితే చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారు భార్యాభర్త కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలు శోకసంత్రంలో మునిగాయి. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాలను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.