ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ.. గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు వైపే మొగ్గు చూపింది అధిష్టానం.. సీనియర్లు ఎంతమంది ఉన్నా అశోక్ గజపతి రాజుకి గవర్నర్ పదవి దక్కడం పై పాలిటిక్స్ లో సర్వత్రా చర్చ నడుస్తోంది. అశోక్ గజపతి రాజు వైపు ఎన్డీఏ ప్రభుత్వం మొగ్గు చూపడానికి కారణాలేంటి? అసలు అశోక్ గజపతిరాజు ఎవరు?.. అంటే అశోక్ గజపతి రాజు భారతదేశ సంస్థానాల్లోనే అత్యంత గౌరవం పొందిన గజపతిరాజుల సంస్థాన వారసులు. అశోక్ గజపతి తండ్రి పివిజి రాజు చివరి పట్టాభిషిక్తుడు. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత పీవీజీ రాజు రాజకీయాల్లో కూడా రాణించారు. పివిజి రాజు కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన రాజకీయ వారసుడే అశోక్ గజపతిరాజు. రాజకీయాల్లో అశోక్ టిడిపి అధినేత చంద్రబాబుకు సమకాలీకులు.. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన అపార అనుభవం ఉంది.. రాజకీయాల్లో నీతినిజాయితీకి కేరాఫ్ అడ్రస్ నిలిచారు.. అంతటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆ పెద్దాయనకు ఇప్పడు గవర్నర్ గిరి దక్కింది.
అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడం పై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈయన టిడిపి సీనియర్ నేత. పార్టీలో నెంబర్ టూ గా వ్యవహరించిన అశోక్ గజపతిరాజు ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపిగా విజయనగరం నుండి ఎన్నికయ్యారు. కీలక రాష్ట్ర మంత్రి పదవులతో పాటు 2014 మోదీ కేబినెట్ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నెతెచ్చిన నేత. 2024 ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. అప్పటి నుంచి అతని సీనియారిటీ, సిన్సియారిటి నేపథ్యంలో తప్పకుండా కీలక పదవి దక్కనుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు సంక్షోభంలో ఉన్న ప్రతిసారి చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలబడ్డ నేతగా పేరున్న అశోక్ గజపతి కి దక్కనున్న ఆ కీలక పదవి ఎంటా అని సర్వత్రా చర్చ జోరుగా సాగింది. అశోక్ గజపతి రాజుకి ఆయన లెగసి కి తగ్గట్టు పదవి దక్కుతుందని, అందులోనూ గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్.. ఎన్నికలు జరిగిన నాటి నుండి కార్యకర్తల్లో జోరుగానే సాగింది. అదే విషయం తొలిసారి టీవీ9 కూడా చెప్పింది.
మోడీ ప్రధానిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి అంటే.. ఆయనకు కూడా అపారమైన అభిమానం ఉంది. ఎంతో సింపుల్ గా ఉండే అశోక్ కి పదవుల పై ఎప్పడూ ఆపేక్ష లేదు. రాష్ట్ర మంత్రిగా పనిచేసినా, కేంద్ర మంత్రిగా పనిచేసినా ఎప్పడూ ఆయన నోరు మెదిపి నాకు ఈ పదవి కావాలని ఎప్పుడూ అడగలేదు. పదవులు నేరుగా ఆయన వద్దకే వచ్చేవి. ఇప్పుడు అదే జరిగింది గవర్నర్ పై ఎన్నో ఊహాగానాలు ఉన్నా.. ఆయన మాత్రం ఎవరినీ నోరు తెరిచి అడగలేదు. కానీ గోవా గవర్నర్ గా నియమించినట్లు సడన్ గా రాష్ట్రపతి భవన్ నుండి ప్రకటన విడుదల అయ్యింది.
అశోక్ గజపతిరాజు 1978లో తొలిసారి జనతా పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి 1983 నుండి 2004 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు మినహా ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలుస్తూనే వచ్చారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతిరాజు ఇద్దరు ఒకేసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో తొలిసారి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పనిచేసే తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అనేక వినూత్న సంస్కరణలతో బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు. అయితే 2019 వైసిపి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు లేని విధంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
గత ప్రభుత్వంలోనే మాన్సాస్ ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె అయిన సంచయిత గజపతి రాజును మాన్సాస్ ఛైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో తిరిగి మాన్సాస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో అనేక కేసులు అశోక్ గజపతిరాజు పై నమోదయ్యాయి. అలా ఎప్పుడు లేని విధంగా డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో అశోక్ గజపతిరాజు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఏ రోజు పక్కచూపులు చూడకుండా పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అశోక్ చూపిన అభిమానానికి పార్టీ ఇచ్చిన అరుదైన గౌరవంగా ఆయన అభిమానులు భావిస్తున్నారు..