జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేసవిలోనే వానలు కురిశాయి. కానీ, ఇప్పుడు వర్షాలే లేవు. ఇవాళ తెలుగురాష్ట్రాల్లో వర్షసూచన ఎలా ఉంది. వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు ఇచ్చిందో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి. ఓ లుక్కేయండి.
సమయానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా.. గత కొద్దిరోజులుగా అవి మందగించాయి. అందుకే గడిచిన వారం రోజుల నుంచి అటు ఏపీ, ఇటు తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. అటు గాలులు కూడా బలహీనంగా వీస్తుండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాదు.. ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నెలలో ఇప్పటివరకు 30శాతం లోటు వర్షపాతం నమోదైంది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదిలిక ఉంటుందన్నారు.
మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమల్లో ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా, అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన రెండు వారాలు మధ్య, ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి.
అటు తెలంగాణలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే రానున్న రెండు లేదా మూడు రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయని.. దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగ్ అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు.