తరగతి గదిలో వెనుక బెంచీలు, ముందు బెంచీలు అన్న తేడా ఇక అక్కడ ఉండదు. ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థి సమానమే. ప్రతి ప్రశ్నా విలువైనదే అన్న నినాదంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టింది. కేరళలో విజయవంతంగా అమలువుతున్న ‘యూ-షేప్డ్ బెంచీల’ విధానాన్ని తమ పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులందరినీ ఒకే సమాంతర వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ పాఠశాల ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు పలు పద్ధతులను అవలంబించారు. క్లాస్ రూమ్‌లో ఉపాధ్యాయులతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్న విద్యార్థులే మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. క్లాస్ లో కానీ వెనుక బెంచీలో కూర్చున్న విద్యార్థులు మాత్రం రాణించలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు అందరిలో ఒకే రకమైన ప్రతిభను పెంచేందుకు సరికొత్త విధానానికి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఇందుకు కేరళలో విజయవంతమైన ‘యూ-షేప్డ్ బెంచీల’ విధానాన్ని తమ పాఠశాలలో ప్రవేశపెట్టారు. విద్యార్థులందరినీ ఒకే సమాంతర వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
ఈ మార్పు ఎందుకంటే ?
సాధారణంగా తరగతి గదుల్లో వెనుక కూర్చునే విద్యార్థులు ఉపాధ్యాయులతో నేరుగా సంభాషించడానికి సంకోచిస్తుంటారు. వారి ప్రశ్నలు, సందేహాలు నిశబ్దంగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే ‘యూ-షేప్డ్’ విధానం తెరపైకి వచ్చింది. ఈ రకమైన బెంచీల అమరికలో విద్యార్థులందరూ ఒకరికొకరు అలాగే ఉపాధ్యాయుడికి అభిముఖంగా కూర్చోవడం విశేషం. దీనివల్ల ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడితో నేరుగా సంభాషించే అవకాశం లభిస్తుంది. ఈ నూతన విధానానికి తిరుమలగిరిలో తొలి అడుగు పడింది. తిరుమలగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందుగా 10వ తరగతిలోని మూడు క్లాసుల్లో ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రారంభంలో కొంత ఆశ్చర్యం వ్యక్తమైనా విద్యార్థులు ఈ మార్పును ఎంతగానో ఆస్వాదిస్తున్నారని పాఠశాల హెడ్ మాస్టర్ దామెర శ్రీనివాస్ తెలియజేశారు.
వెనక బెంచ్ విద్యార్థులు అనే పదాన్ని పూర్తిగా తొలగించడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అందరూ ఒకే విధంగా చూసుకుంటూ ఉపాధ్యాయుడితో స్పందించడం అలాగే వెనుకబడిన విద్యార్థులు కూడా సంకోచం లేకుండా ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించడం ఈ విధానం యొక్క లక్ష్యమని చెబుతున్నారు. ఈ వినూత్న బోధనా విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పాఠశాలలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, సానుకూల అభ్యాసన వాతావరణం కల్పించడంలో ఈ ‘యూ-షేప్’ విధానం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.