సీమ ప్రజల నీటి నిరీక్ష ముగిసింది. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు నీటిని విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటించనున్నారు. హంద్రీనివా ప్రాజెక్టులో భాగంగా మల్యాల నుంచి ఫేజ్ 1, 2 కింద 554 కిలో మీటర్ల మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
సీఎం చంద్రబాబు ఈ పనులను పరిశీలించిన అనంతరం హంద్రీనీవా ఎత్తిపోతలకు జలహారతి ఇవ్వనున్నారు. ఆపై మల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేస్తారు. నీటి విడుదల అనంతరం రైతులతో సమావేశంకానున్నారు సీఎం చంద్రబాబు. పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి. ఢిల్లీ నుంచి నేరుగా ఈ ఉదయం 11 గంటల తర్వాత ప్రత్యేక విమానంలో ఓర్వకల్ ఎయిర్పోర్ట్కు వస్తారు చంద్రబాబు. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మల్యాల హంద్రీనీవా దగ్గరకు వెళ్తారు.
హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులు రూ.696 కోట్లతో చేపట్టారు. దీంతో కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరివ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించే సామర్థ్యం పెరిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తిగా నింపనున్నారు. ఫలితంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తి తీరనుంది.
మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తయ్యాయి. జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగుతాయి.
గతంలో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ పూర్తి సామర్ధ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే. ఇప్పటి వరకూ 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్న పరిస్థితి. ప్రస్తుతం కాలువల సామర్ధ్యం 3,850 క్యూసెక్కులకు పెరగటంతో ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలగనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది.