నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మందేసి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్ల పనిపట్టేందుకు ఇకపై పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్ ప్రాంతంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సైతం పాల్గొని డ్రంక్ అండ్ డ్రైవ్‌లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, మందుబాబులను పట్టుకునేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఆకస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీసు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారు అనే భావనలో నగరవాసులు ఉన్నారని ఆయన అన్నారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా రాత్రి పూటల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ కొందరు పగటి పూట కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఆయన వివరించారు. అయితే, గత జూన్ నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడ్డారని ఆయన తెలిపారు ఇదొక్కటే కాదు ఇలా మొత్తం 35 మంది పాఠశాల బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన వివరించారు.
ఈ క్రమంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతోనే డేటైంలో కూడా ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా.. వాహనాల రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు ఇలాంటి కేసులను తగ్గించేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు చేపడతామన్నారు.
మైనర్లు డ్రైవింగ్‌లో దొరికితే.. 25 ఏళ్ల వరకు నోలైసెన్స్
మరోవైపు మైనర్లు డ్రంక్ ఎండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు ఆయన తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా ఇప్పటి వరకు సుమారు 4,500 మైనర్ డ్రైవింగ్ కేసులను నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 2,800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆర్టీవో అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. 863 వాహనాల రిజిస్ట్రేషన్‌లను రద్దు చేశామన్నారు. మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే వాళ్లకు 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో ఇప్పటివరకు సుమారు 30వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని.. అందులో వెయ్యి మందికి పైగా జైలుకి వెళ్లి వచ్చారని ట్రాఫిక్ సీపీ వెల్లడించారు.