తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరంర ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా, విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లను పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి, 9వ షెడ్యూల్‌లో ఈ మేరకు మార్పులు చేయాలనీ ప్రధానిని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో.. ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత.. మంత్రి, సీఎం ఆమోదంతో రాజ్‌భవన్‌కు ముసాయిదాను పంపించింది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ ప్రకారం స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండాలి. అందులో 50శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించి.. చట్టాన్ని సవరిస్తే రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి చిక్కులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే.. గవర్నర్ ఆమోదిస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు అధికార, విపక్షాల మధ్య రాజకీయ మంటలు రేగుతూనే ఉన్నాయి. బీసీలను మోసం చేయాలని చూస్తే మరో భూకంపం వస్తుందని బీఆర్‌ఎస్ హెచ్చరిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ను ఎవరూ అడ్డుకోవద్దంటూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.