ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? సొంత ఇంటి పార్టీలో సమస్యలకు కారణం ఇంటి వాస్తు బాగా లేకపోవడమేనా? కవిత ఇంటిలో జరుగుతున్న మార్పులు ఏంటి..?
ఇంటి వాస్తు.. ఇది చాలామంది నమ్మకం. ఈ వాస్తు బాగుంటేనే మనకు మంచి జరుగుతుంది అని.. తాము చేసే అన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తామని నమ్ముతూ ఉంటారు. అందులో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్సీ కవిత కూడా వాస్తు మార్పులు చేయిస్తున్నారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఆమె హైదరాబాదులో గాంధీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కవితకు సరైన నివాసం లేదు. అప్పటి ఎన్నికల్లో ఆమె తన సిట్టింగ్ స్థానం అయిన నిజామాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు కవిత. అయితే ఆ ఇంట్లోకి వెళ్లిన నాటి నుంచి ఆమెకు సరిగ్గా కలిసి రాలేదని ప్రచారం జరుగుతుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు దగ్గరుండి ఎంతో ఇష్టంగా కట్టించుకుని ఇంట్లోకి గృహప్రవేశం చేసిన కవితకు.. ఆ తర్వాత నుంచి ఇబ్బందులు మొదలయ్యాయని ఆమె అనుచరులు చెబుతూ ఉంటారు. ఆ ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి ఈడి కేసులు, సిబిఐ కేసులతో ఆమె సతమతమైంది. నందినగర్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈడి అధికారులు ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత దాదాపు ఆరు నెలపాటు జైలు జీవితం గడిపిన కవిత ..మళ్లీ అదే ఇంటికి వచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు స్థానం దక్కడం లేదని కొంత నిరాశకు గురై తన తండ్రికి లేఖ రాశారు కవిత. తర్వాత పార్టీని, కేటీఆర్‌ని, హరీష్ రావుని ఇన్ డైరెక్ట్‌గా విమర్శిస్తూ వస్తున్నారు.
అయితే కవిత ఇంతలా విమర్శలు చేస్తున్నా… బిఆర్ఎస్ అగ్ర నేతలతో పాటు అందరూ లైట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఓ సిద్ధాంతి సూచనల మేరకు వాస్తు మార్పులకు సిద్ధమయ్యారు. నెల క్రితమే తన ఇంటి పక్కనే ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యాలయంలో కూడా వాస్తు మార్పులు చేపట్టారు. ప్రధానంగా ఆమె ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి ముందు గోడను తొలగించారు. ఈ మధ్యకాలంలోనే పూజ కార్యక్రమాలు పూర్తి చేసి మొదలుపెట్టిన జాగృతి కార్యాలయం ఎంట్రెన్స్ కూడా పక్కకు మార్చారు. ఇక ప్రస్తుతం ఆమె నివాసం ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని పక్కకు మార్చుతున్నారు. ఇప్పుడు వాయువ్య మూలలో ఉన్న ప్రధాన ద్వారాన్ని ఇంటి మధ్యలోకి మారుస్తున్నారు. పైన ఉన్న ఇల్లు సింహద్వారానికి ఎదురుగా.. ఈ ప్రధాన ద్వారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తన ఇంట్లో నుంచి జాగృతి కార్యాలయంలోకి వెళ్లడానికి కూడా ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆషాడ మాసం పూర్తయి… శ్రావణమాసం వచ్చేలోపు ఈ వాస్తు మార్పులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు ఎమ్మెల్సీ కవిత.
ఇప్పుడు తనకు మంచి జరగడం లేదని.. త్వరలో తనకు మంచి రోజులు రాబోతున్నాయని చెబుతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇంటి వాస్తు బాగా లేకపోవడం వల్లే ఇబ్బందుల పాలవుతుందని కవిత అనుచరులు కూడా అనుకుంటున్నారు. నిజంగా వాస్తు దోషమే కవితకు బ్యాడ్ డేస్ తీసుకొచ్చిందా.. తాజా మార్పులతో మళ్లీ ఆమె ట్రాక్‌లోకి వస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.