ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక ఇదొక జీవనాధారంగా మారింది. కానీ పలుచోట్ల ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రామికుల పైసలు దోచుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మరికొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లతో మంచి ఉంటూ పనికి రాకున్నా వచ్చినట్లు అటెండెన్స్ వేయించకుంటారు. ఈ అక్రమాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. క్షేత్రస్థాయి అవకతవకలు జరగకుండా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై పనిచేసే చోట కూలీలను రెండుసార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.
గత సోమవారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌లో కార్మికుల ఫొటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫొటో ఉదయం 9గంటలకు తీసి అప్ లోడ్ చేయాలి. తర్వాతి ఫొటో సాయంత్రం 4గంటలకు తర్వాత తీయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఈ ఫొటోలను పంచాయతీ సెక్రెటరీలు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాకుండా మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు, ఎన్ని తియ్యలేదని అనేవి చెక్ చేయాలి. అన్నీ గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. జిల్లా ఆఫీసులో ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది. గ్రామ స్థాయి నుంచి వచ్చిన ఫొటోలు సరిగ్గానే ఉన్నాయా..? లేదా ఇతర ఫొటోలు అప్ లోడ్ చేశారా.? అటెండెన్స్‌లో ఏమైన వ్యతాసాలు ఉన్నాయా అనే విషయాలను అధికారులు క్షున్నంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు గ్రామ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఎప్పటికప్పుడు రివ్యూలు జరిపి.. అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.