భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఇకపై గతంలో లాగా స్వామివారి ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు ఈవో శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. గతంలో స్వామి వారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్‌ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇక టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు మాట్లాడుతూ ఇప్పటివరకు తిరుమలలో నెయ్యి నాణ్యత ను పరీక్షించే వసతి లేదని, ఇప్పుడు తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన జేసీ (గ్యాస్ క్రోమాటోగ్రాఫ్) హెచ్ పీ ఎల్ సీ (హై పర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రాఫ్) వంటి పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. రూ.75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) విరాళంగా అందజేసిందన్నారు. ల్యాబ్ సిబ్బంది, పోటు కార్మికులు మైసూర్‌లోని సీ ఎఫ్ టి ఆర్ ఐ లో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్‌లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
శ్రీవాణి టికెట్స్ కౌంటర్ ప్రారంభం
తిరుమలలో నూతన శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రం ప్రారంభమైంది. శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు తో కలిసి ప్రారంభించారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్ల లో నిలబడు తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో రూ.60 లక్షల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు.
మంగళవారం నుంచి ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభం అవుతుందన్నారు. సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు చైర్మన్ బి ఆర్ నాయుడు. హెచ్ వీసీ, ఏఎన్సీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన సబ్ ఎంక్వయిరీ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, భాను ప్రకాష్ రెడ్డి, శాంతా రామ్, నరేష్, సదాశివరావు, నర్సిరెడ్డి, జానకి దేవి తోపాటు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.