ఏపీలో మళ్లీ కాలనాగులు బుసలు కొడుతున్నాయి. ధర్మవరంలో కాల్‌మనీ గ్యాంగ్ రెచ్చిపోయింది. వారానికి 10 రూపాయల వడ్డీ కట్టాలంటూ ఓ కుటుంబంపై దారుణంగా దాడి చేసింది. తీసుకున్న అప్పుకు మూడింతలు చెల్లించినా, ఇంకా ఇవ్వాలంటూ, రమణ కుటుంబాన్ని వేధిస్తోంది.
ఏకంగా ఇంట్లోకి దూరి దాడికి పాల్పడ్డారు. అలాగని రాజకీయ కక్షలుకార్పణ్యాలు కావు. గెట్టు తగాదాలు అంతకన్నా కావు. ఇది కాలనాగుల కిరాతకాలకు సాక్ష్యం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలకు పరాకాష్ట ఇది. అవసరం కోసం అప్పు చేసిన పాపానికి రమణ అనే వ్యక్తిని, అతడి కుటుంబాన్ని దారుణంగా వేధిస్తోంది రాజశేఖర్ అలియాస్ రాజా ఆధ్వర్యంలో నడిచే కాల్‌మనీ గ్యాంగ్. వారానికి పది రూపాయల వడ్డీ తీసుకుంటూ ఇన్నాళ్లు రమణ కుటుంబాన్ని వేధించాడు కాల్‌మనీ రాజా. తీసుకున్న 6 లక్షల రూపాయల అప్పునకు 15 లక్షల రూపాయలు కట్టేసినా, ఈ కాల్‌మనీ వడ్డీ పిశాచాల ధనదాహం తీరలేదు.
ఇంకా డబ్బులు కట్టాలంటూ శాంతినగర్‌లోని రమణ ఇంట్లో చొరబడి, వాళ్లను దారుణంగా కొట్టారు రాజా అండ్ కాలకేయుల గ్యాంగ్. ఇంట్లో మహిళలు, పిల్లలు ఏడుస్తున్నా కూడా కనికరించకుండా దారుణంగా దాడి చేసింది కాల్ మనీ గ్యాంగ్. ధర్మవరంలో కాల్ మనీ గ్యాంగ్ అరాచకాలు శృతిమించిపోతున్నాయి. కాల్‌మనీ గ్యాంగ్ దాడుల నుంచి తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. కాల్ మనీ పేరుతో జనాన్ని పీడించుకు తింటున్న రాజా గ్యాంగ్ అంతు చూస్తామంటున్నారు పోలీసులు. కాల్‌మనీ గ్యాంగులను ఉక్కుపాదంతో అణిచివేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.