కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎవరైన వేధిస్తే కార్యకర్తలు ఈ యాప్‌లో ఆ వివరాలను నమోదు చేయాలని సూచించారు.
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార – విపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. వేధింపులకు గురిచేస్తున్నారనేది వైసీపీ వాదన. తాము అధికారంలో వచ్చాక అసలుకు వడ్డీ కలిపి తీర్చుకుంటామంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేతలపై ప్రభుత్వ వేధింపులకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలను ఎవరైన వేధిస్తే ఆ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పార్టీ డిజిటల్ లైబ్రరీలో అన్నీ సేవ్ చేసి.. అధికారంలోకి రాగానే వేధించిన వాళ్లందరికీ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. వైసీపీ పీఏసీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ భయానక వాతావరణ సృష్టిస్తోందని జగన్ మండిపడ్డారు. వైసీపీ సీనియర్ నేతలను అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇదే పద్ధతి కొనసాగితే తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మిథున్ రెడ్డి అరెస్ట్ బాధకరమని.. లిక్కర్ కేసుతో ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సామాన్యుడి నుంచి ఎంపీగా ఎదిగిన నందిగాం సురేశ్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం ఘోరమన్నారు. అధికారంలోకి వచ్చాక అసలుకు వడ్డీ కలిపి చూపిస్తామన్నారు.
సీఎం చంద్రబాబు ఏం విత్తారో అదే చెట్టు అవుతుందని జగన్ అన్నారు. ఇప్పుడు ఆయన చేసేదే ఆయనకు రివర్స్ వస్తుందని తెలిపారు. పార్టీలోని వ్యవస్థలను నాయకులు, కార్యకర్తలు వినియోగించుకోవాలని జగన్ సూచించారు. గ్రామ కమిటీల నిర్మాణం సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ అంశంలో నాయకులు మరింతగా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పారు. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామనే భావన ప్రజల్లో ఉందని.. పార్టీ శ్రేణులు సైతం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.