గండికోట రహస్య వీడేదెప్పుడు? ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి హత్య జరిగి 18రోజులైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. కోట చుట్టూ కొండ చుట్టూ కలియతిరుగుతున్నారు. బట్.. ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా? అసలీ కేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారా? అందులో భాగంగానే సాగ దీస్తున్నారా? టెక్నాలజీ మీద భారం వేసి చేతులెత్తేస్తారా?
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో వైష్ణవి హత్యకు గురయింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈనెల 14న జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సీన్ ఆఫెన్స్ ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరంభంలో అన్ని ఆధారాలు దొరికాయి.. ఇక వెల్లడించడమే తరువాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. బట్.. ఇప్పటిదాకా కేసులో ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు.
11.00 నుంచి 12.00 గం.ల మధ్య టూరిస్ట్ సెల్ఫీలో వైష్ణవి
ఈనెల 14న కాలేజీకి వెళ్తున్నానని చెప్పి.. ఇంట్లోంచి వెళ్లింది వైష్ణవి. కాలేజీకి వెళ్లకుండా ప్రియుడు లోకేష్‌తో కలిసి గండికోటకు వెళ్లింది. లాడ్జీలో రెండు గంటలపాటు ఇద్దరూ మాట్లాడుకుని బయటికొచ్చారు. గండికోట గుమ్మం దగ్గర 10.40 నిమిషాలకు వైష్ణవిని డ్రాప్ చేసి లోకేష్ ఒక్కడే బైక్‌పై జమ్మలమడుగు వైపు వెళ్లిపోయాడు. లోకేష్ వెళ్లిన కాసేపటికే వైష్ణవి పెదనాన్న కొడుకు గండికోట ప్రాంతానికి వెళ్లాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అదే రోజు 11 నుంచి 12 గంటల మధ్యలో గండికోటకు వచ్చిన ఓ టూరిస్ట్ సెల్ఫీలోనూ వైష్ణవి కనిపించింది. అంటే.. అప్పటిదాకా వైష్ణవి బతికే ఉంది. ఆ తర్వాత ఆలయంవైపు ఆమెను ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు హత్య చేశారన్నది మిస్టరీగా మారింది.
లోకేష్ పాత్ర లేదని తేల్చిన పోలీసులు
ముందుగా లోకేష్‌ను ప్రశ్నించారు. అతని కాల్ డేటాపై ఆరాతీశారు. ఒకటికి నాలుగుసార్లు క్రాస్ చెక్ చేసుకుని అతని పాత్ర ఏం లేదని తేల్చారు. ఆ తర్వాత పరువు హత్య జరిగిందన్న ప్రచారంతో వైష్ణవి కుటుంబసభ్యుల్ని రోజుల తరబడి ప్రశ్నించారు. వాళ్ల ఫోన్ డేటాను పరిశీలించారు. హత్యతో వాళ్లకు సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరయితే హత్య చేసిందెవరు?
ఆస్థినంతా వైష్ణవి పేరు మీద రాసిన అమ్మమ్మ
నిజానికి వైష్ణవి – లోకేష్ కుటుంబాలకు చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అవేవీ లెక్కచేయకుండా వీళ్లిద్దరూ ప్రేమలోపడ్డారు. ఈ విషయం పక్కనపెడితే అమ్మమ్మ సంబంధించిన ఆస్థినంతా వైష్ణవి పేరు మీదే రాసిందట. ఒకవేళ వైష్ణవి – లోకేష్‌ల పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం వాళ్లకే వెళ్తుందన్న అనుమానంతో హత్య జరిగిందన్న ప్రచారం జోరందుకుంది. ఈ విషయంలోనూ విచారణ చేపట్టిన పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు.
హత్య జరిగిన రోజు గండికోటకు 350మంది టూరిస్ట్‌లు
వైష్ణవిని టూరిస్ట్‌లు ఎవరైనా చంపేసి ఉంటారన్న అనుమానంతో ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన రోజు గండికోటకు 350 మంది సందర్శకులు వచ్చినట్టు ఐడెంటిఫై చేశారు. 11.45 నుంచి 1.45 గంటల మధ్య వైష్ణవి హత్యకు గురైనట్టు పోలీసులు భావించారు. ఈ రెండు గంటల సమయంలో 69 మంది టూరిస్ట్‌లు స్పాట్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించారు. వాళ్ల వివరాలను సేకరించి.. ఇప్పటికే కొంతమందిని ప్రశ్నించారు. మరికొందర్ని విచారణకు పిలిచే పనిలో ఉన్నారు. దర్యాప్తు జరుగుతుంది సరే.. క్లూ సంగతేంటన్నదే అంతుపట్టడం లేదు. ఇక పోలీసుల వెర్షన్ మరింత దారుణంగా తయారైంది.
మర్డర్ కేసును సీరియస్‌గా పరిగణించడం లేదా?
ఈ కేసును పోలీసులు తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కేసు చేదన ఎందుకు లేటువుతుందని జర్నలిస్టులు అడిగితే… మాకు దివ్య శక్తులు లేవు.. మానవ శక్తులతో దీన్ని చేధిస్తాం.. అంటూ కర్నూలు రేంజ్ డి.ఐ.జి కోయ ప్రవీణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. బాధిత కుటుంబానికి ధైర్యమిచ్చేలా మాట్లాడకుండా.. మర్డర్ కేసును తీవ్రంగా పరిగణించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడ్డ పోలీసులు.. సెల్ సిగ్నల్ పవర్ డంప్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు సత్పలితాలు ఇస్తుందనేది చూడాలి. బాధిత కుటుంబం మాత్రం హత్య కేసును వేగంగా ఛేదించాలి.. బాధ్యులకు శిక్షపడాలని కోరుకుంటోంది.