ఈ యువతకు ఏమైంది..? గుండె లయ తప్పడానికి కారణాలు ఇవేనా..?

ఇటీవల ఉప్పల్‌లో ఓ యువకుడు బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీనికి కారణం అతడికి సడన్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ కావడమే. సికింద్రాబాద్‌కు చెందిన 24ఏళ్ల యువకుడు జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఇటీవల గుండెపోటుతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడా గుండెపోటే కారణం. ఇలా ఇటీవల చాలామంది యువకులు ముఖ్యంగా 30 ఏళ్లలోపే గుండెపోటుకు గురవుతున్నారు. వీటన్నిటికీ కారణాలేంటి? ఈ యువత గుండెకు ఏమైంది. అంత వీక్‌గా మనోళ్లు ఉన్నారా? అన్న అంశాలు ఇప్పుడు చర్చనీయాంశం కానున్నాయి.

తమ దగ్గరికి వచ్చే గుండె జబ్బు బాధితుల్లో యువకులే ఎక్కువగా ఉంటున్నారని హృద్రోగ నిపుణులు కూడా చెబుతున్నారు. ఒకప్పుడు 50, 60 ఏళ్ల వయసు దాటిన వారిలోనే కనిపించే గుండె జబ్బులు.. ఇప్పుడు 20-30 ఏళ్ల వయసు వారిలోనూ చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, కండరాల వాపు వంటి వాటితో పాటు అంతకుముందు కుటుంబంలో ఎవరికో ఒకరికి ఈ జబ్బులు ఉంటేఈ పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. చిన్నప్పటి నుంచే జంక్‌ ఫుడ్‌ను అధిక మొత్తంలో తీసుకుంటుండటం వల్ల కొవ్వు శాతం పెరిగి గుండె స్పందనల్లో తేడాలొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొందరికి పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తాయంటున్నారు. ఇక మాదక ద్రవ్యాలు, ధూమపానం, మద్యపానం చేసే వారిలోనూ గుండె సమస్యలొచ్చే ముప్పు అధికమని అంటున్నారు. అందుకే 25 ఏళ్లు దాటినప్పటి నుంచే గుండె ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

చిన్న వయసులోనే క్రీడాకారులు ఇలాంటి ఆకస్మిక మరణానికి గురైతే హెచ్‌సీఎం- హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి కారణం అయి ఉంటుందన్నారు. ఈ వ్యాధి ఉన్న వారిలో గుండె కండరాలు లావుగా ఉంటాయి. ఇది వంశపారంపర్యంగా వచ్చి ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో గుండె నిమిషానికి 210 సార్లకంటే ఎక్కువగా కొట్టుకోవడం ద్వారా దాని చలనం ఆగిపోయి.. రక్తప్రసరణ జరగకుండా చనిపోతారు. యువకుల్లోనే ఇలాంటివి కనిపిస్తాయి. అథ్లెట్లు, క్రీడాకారులు కొన్ని రకాల స్టెరాయిడ్లు వినియోగించినా కండరాలు అధికంగా సంకోచ వ్యాకోచాలకు గురై ఒక దశలో ఆగిపోయి చనిపోతారు. వ్యాయామానికి ముందు యువకులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి. తల్లిదండ్రులకు ఇతర రక్తసంబంధీకులకు గుండెజబ్బులు ఉంటే వారు జాగ్రత్తలు తీసుకోవాలి.

అలాగే మధుమేహం, అధిక రక్తపోటు రక్తనాళాలను దెబ్బతీసి, కొవ్వు పేరుకుపోయి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. షుగర్‌ ఉంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ముప్పు ఉంటుంది. కొవిడ్‌ వైరస్‌ గుండె కండరాలకు వాపు కలిగించవచ్చు. ఇది కూడా గుండె పోటు ప్రమాదాన్ని పెంచవచ్చు. యువతలో గుండెపోటు నివారించడానికి పండ్లు, కూరగాయలు, చేపలు, చికెన్‌, తృణధాన్యాల వంటి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. రోజూ ఎక్సర్‌సైజులు చేయాలని సూచిస్తున్నారు. 40 సంవత్సరాలు పైబడిన వారు నడుస్తూనో.. వ్యాయామం చేస్తూనో.. గుండెనొప్పితో కుప్పకూలిపోతున్నారు. కార్డియాక్‌ అరెస్టు కావడమే ఇలాంటి ఘటనలకు కారణం.

రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నా.. ముందే గుర్తించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆహారం ఊపిరితిత్తులకు చేరడం వల్ల రక్తనాళాల్లో అడ్డుపడి మృత్యువాత పడతారు. స్టెరాయిడ్లు వాడకూడదు. చిన్న వ్యాయామాలకైనా.. పరిగెత్తినా అలసటగా ఉంటే వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సడన్ స్ట్రోక్‌ వచ్చే వారిలో సగం మంది ఆస్పత్రికి చేరకుండానే మరణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తొలి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారు.. అప్పుడు తక్షణ చికిత్స అందిస్తే బాధితుడి కాపాడుకోవచ్చు. సీపీఆర్‌ చేయడం ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలంటున్నారు వైద్యులు.

About Kadam

Check Also

గొర్రెల పంపిణీ కేసులో దూకుడు పెంచిన ఈడీ.. సోదాల్లో వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

గొర్రెల పంపిణీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో అవినీతికి పాల్పడ్డ వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *