సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్వహించే విద్యాసంస్థలనే బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. నారాయణ అల్లుడు పేరుతో సైబర్ నేరగాళ్లు ఇన్స్‌స్టిట్యూట్ అకౌంటెంట్ మెయిల్ చేసి బోల్తా కొట్టించారు. అర్జెంటుగా రూ.1.96 కోట్లు డబ్బు కావాలంటూ నారాయణ అల్లుడు పేరుతో మెసేజ్ చేసి నగదు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ సంఖ్య ఏపీలో భారీగా పెరిగింది. ఒక్క మెసేజ్ తో అకౌంట్లు ఖాళీయే పరిస్థితి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి లో ఉన్న వారు సైతం ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఒకసారి అకౌంట్లో నుంచి డబ్బు మాయమైతే తిరిగి రికవరీ చేసుకోలేని పరిస్థితిలో కొన్ని వేలమంది ఇబ్బందులు పడుతున్నారు. తాజగా ఒక్క మెసేజ్ తో రూ 1.96 కోట్లు నగదు ట్రాన్స్ఫర్ చేయించిన ఘటన నెల్లూరులో ఇటీవల కలకలం రేపింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ ని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.
పునీత్ పేరుతో నారాయణ ఇన్స్‌స్టిట్యూట్ అకౌంటెంట్‌కు మెసేజ్ పెట్టారు సైబర్ నేరగాళ్ళు. అర్జెంటుగా రూ. 1.96 కోట్లు నగదు కావాలని బిజినెస్ డీల్ సంబంధించి నగదు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అయితే మెసేజ్ చేసింది సాక్షాత్తు మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కావడంతో క్షణం ఆలోచించకుండా అకౌంటెంట్లోని నగదును సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే కొన్ని గంటలకే విషయం గుర్తించిన అకౌంటెంట్ సైబర్ క్రైమ్ జరిగిందంటూ యాజమాన్యానికి తెలిపింది. దీంతో సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తించిన నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తో విచారణ చేపట్టిన పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు కలిసి ఈ సైబర్ క్రైమ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిలో అరవింద్ కుమార్, సంజీవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ జరిగిన రూ.1.96 కోట్లలో రూ.1.40 కోట్లు నగదు ను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.