వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే సహకార సంఘాల ఎదుట క్యూ కడుతున్నా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం చెలరేగింది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పరిస్థితి మరింత విషమించింది.
యూరియా కొరత రైతులను తీవ్ర స్థాయిలో వేధిస్తుంది. వర్షాలు విస్తారంగా కురవడంతో అన్ని పంటలకు ఇప్పుడు యూరియా అనేది అత్యంత అవసరంగా మారింది. ఉదయం 5 గంటల నుండే రైతులు పలు సహకార సంఘాల వద్దకు చేరుకొని యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. వానలో తడుస్తూ యూరియా సరఫరా కేంద్రాల ముందు రైతులు క్యూ కడుతున్నారు.పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరుతూ..క్యూ లైన్లనో చెప్పులు పెడుతున్నారు..రోడ్లపైకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నారు. అయ్యా యూరియా అంటూ అధికారుల ముందు ధీనంగా వేడుకుంటున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది.
గత కొద్దిరోజులుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొనగా సిద్దిపేట జిల్లా రైతులు విసిగిపోతున్నారు. ఇలా అయితే పని అయ్యేలా లేదని శనివారం అల్వాల్ గ్రామ రైతులు రైతు వేదికలో ఇద్దరు వ్యవసాయ అధికారులను కార్యాలయం లోపల వేసి బయటకు తాళం వేశారు.. మిరుదొడ్డి (మం) అల్వాల గ్రామంలో శనివారం రెండు లారీలా యూరియాను పంపిణీ చేసారు అధికారులు..ఇంకా కొంతమంది రైతులకు యూరియా తక్కువ పడటంతో ఆగ్రహించిన రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదిక భవనంలో బంధించి తాళం వేసారు. అక్కడే ఉన్న పోలీసులు ఎంత నచ్చజెప్పినా కూడా రైతులు వినలేదు. చివరికి యూరియాను తెప్పించి ఇస్తాం అని హామీ ఇవ్వడంతో అధికారులు బయటకు వచ్చేందుకు అనుమతించారు.