రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది. మరోవైపు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటన జారీ చేశారు. భారీవర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొఫెసర్ రాజేందర్ కట్ల ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా తేదీల్లో జరగవల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన చెప్పారు. వాయిదా వేసిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఇక కరీంనగర్ శాతవాహన వర్సిటీ పరిధిలో గురువారం నిర్వహించనున్న బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా వేశారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేసిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్స్లో స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను నిర్వహించిన సర్కార్.. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినా దాదాపు 48 వేలకు పైగా సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్లో 48,630 సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ద్వారా విద్యార్ధులకు సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇంటర్ సెకండ్ ఇయర్లో 13,256 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 12,668 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆరో తరగతికి 7,543 సీట్లు, ఏడో తరగతికి 5,192 సీట్లు, 8వ తరగతికి 3,936 సీట్లు, 9వ తరగతికి 2,884 సీట్లు, పదో తరగతికి 3,151 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ప్రవేశం పొందాలంటే నేరుగా ఆయా పాఠశాలలకు వెళ్లి ప్రిన్సిపల్ను కలిసి ప్రవేశాలు పొందొచ్చు.