రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టి వెళ్లిన క్రీడా ప్రోత్సాహకాలను రిలీజ్ చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు లబ్ధి చేకూరనుంది. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయడంలో రాష్ట్రంలోని క్రీడా కారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ.. క్రీడలు, క్రీడాకారుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ నిర్ణయం నిదర్శనమని ఆయన అన్నారు. బకాయిలు రిలీజ్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి క్రీడాకారుల తరఫున రవినాయుడు కృతజ్ఞతలు తెలిపారు.