ఏపీ, తెలంగాణకు వర్షసూచన కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి మరి.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా.. ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే.. ఏపీలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా.. ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 8 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
తెలంగాణలోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. నారాయణపేట్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈ మూడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. జోగులాంబ, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ 12 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.