విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో వరుసగా జరుగుతున్న చేతబడి ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల రంగరాయపురం, జమ్మాదేవిపేట గ్రామాల్లో చోటుచేసుకున్న సంఘటనలు స్థానికులను కలవరపెడుతున్నాయి. రంగరాయపురంలో ఓ ఇంటి ముందు భయానక దృశ్యం కనిపించింది. ఇంటి ముందు ముగ్గులు వేసి, మనిషి ఆకారంలో ఉన్న బొమ్మను తయారు చేసి, మధ్యలో నిమ్మకాయలు ఉంచి వాటిపై పసుపు, కుంకుమ రాసి భయానక పూజలు జరిగి కనిపించాయి. ఈ దృశ్యం చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పని ఎవరు చేశారు అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇది ఒక్కసారి మాత్రమే జరిగిన ఘటన కాదని, గత వారం రోజుల క్రితం రంగరాయపురలోని ఒక వీధిలో ఇలాంటి చేతబడి ఘటనే జరిగినట్లు గుర్తించారు.
అదే గ్రామంలో మరొక ఇంటి ముందు ఇంట్లో లేని సమయంలో గుమ్మం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నువ్వులు, నిమ్మకాయలు వేసి పూజలు చేశారు. అదే విధంగా జమ్మాదేవిపేట గ్రామంలో ఒక వ్యక్తి కొత్త ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసేందుకు ముహూర్తం పెట్టుకున్న సందర్భంలో అదే ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సుమారు మూడు కేజీలకు పైగా నల్ల నువ్వులు పోసి పూజలు చేసినట్లు బయటపడింది.
ఇలా మండలంలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రజలు రాత్రివేళలు బయటకు వెళ్లడానికీ వెనకాడుతున్నారు. చేతబడి అనుమానం ప్రజల్లో భయాన్ని మరింత పెంచుతుండగా, కొందరు దీన్ని దుష్టచేష్టలుగా, మరికొందరు ఉద్దేశపూర్వకంగా భయపెట్టే ప్రయత్నంగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు తక్షణమే నిఘా పెట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఈ పరిస్థితులు మరింత పెరిగి.. భయాందోళనలు పెరిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు అంటున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal