మంత్రి పదవి ఇవ్వనందుకే కొత్త పార్టీ… ఇదెన్నాళ్లుంటుందిలే అన్నారు టీఆర్ఎస్ పెట్టినప్పుడు. ఆ మాటలన్న కొన్నాళ్లకే స్థానిక సంస్థల్లో సత్తా చాటింది కారు గుర్తు. కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవేగా.. దమ్ముంటే రాజీనామా చేయ్, గెలిస్తే తెలంగాణకు రెఫరెండమే అన్నారు సాక్షాత్తు ఆనాటి సీఎం వైఎస్. బ్రహ్మాండమైన మెజారిటీ ఆనాడు. ఉద్యమం తారస్థాయికి చేరిన వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కారు ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. పార్టీలో చీలికలు. ఒకసారి కాదు.. రెండు సార్లు. గులాబీ పార్టీని వీడింది ఒకరిద్దరు కాదు.. పది మంది. నాడు పడుతూ లేస్తూనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి, ప్రత్యర్ధులతోనే రాజకీయ దురంధరుడు అనిపించుకున్నారు.
బట్.. ఎంతవారికైనా టైమ్ కొంతకాలం వరకే కలిసొస్తుంది. కారు పార్టీ టాప్‌గేర్‌లో ఎంత స్పీడ్‌గా వెళ్లిందో.. అంతే స్పీడ్‌గా షెడ్డుకూ చేరింది. వరుస ఓటములు. పార్టీని మిగుల్చుతారా లేదా అనేంతగా వలసలు. ఓవైపు అవినీతి ఆరోపణలు, కేసులు, కోర్టులు, నోటీసులు, ఏకంగా సీబీఐ ఎంక్వైరీలు. ఇన్ని ఎదురుదెబ్బల నడుమ.. ఊహించని సంక్షోభం. రాజకీయాల్లో పడడం, గెలవడం పరిపాటే. కేసీఆర్‌కూ అది అలవాటే. బట్.. ఈ సిచ్యుయేషనే కొత్తది. ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని? స్టీరింగ్‌ను ఎలా తిప్పుతారు? కంప్లీట్ డిటైల్స్…
కింద పడకుండానే నడక నేర్చుకున్నదెవరు? సంక్షోభాలు చూడకుండా పార్టీలు నడిపిందెవరు? గెలుపోటముల రుచి చూడకుండా అధికారపీఠంపై కూర్చున్నదెవరు? ప్రతి పార్టీ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న పోరాటమే ఇది. బీఆర్ఎస్ కూడా దానికి అతీతం కాదంతే. పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోవడం వేరు. పార్టీ నుంచి నాయకులను సస్పెండ్ చేయడం వేరు. కాని, సొంత కుటుంబ సభ్యులనే పార్టీ నుంచి బయటకు పంపించడమే కాస్త వేరు. కచ్చితంగా బీఆర్ఎస్కు ఇది సంక్షోభ కాలమే. అసలెక్కడ మొదలైంది ఈ డౌన్‌ఫాల్? దాని వెనక కారణాలను బీఆర్ఎస్ విశ్లేషించుకుందా? తెలంగాణ అంటే టీఆర్ఎస్… టీఆర్ఎస్ అంటే తెలంగాణ. ఇలా ప్రజలు అనుకుంటున్నారని 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ అలాగే అనుకుంది పార్టీ.
కాని, కథను అంతకు ఏడాది ముందే మార్చేశారని తెలుసుకోలేకపోయారు. 2022 అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. అప్పటి నుంచి పార్టీని ఓన్ చేసుకోలేకపోయారో, ఆల్రడీ గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తో గానీ.. సరిగ్గా ఏడాది తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది పార్టీ. సాక్షాత్తు సీఎం స్థానంలో ఉన్నప్పుడే.. కామారెడ్డి స్థానం నుంచి ఓడిపోయారు కేసీఆర్. అప్పటి వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా తెలియని నాయకుని చేతిలో పరాజయం పాలయ్యారు. అక్కడున్నది లోకల్‌గా పేరున్న లీడరే కావొచ్చు. బట్.. కేసీఆర్ కంటే గొప్పనా? అక్కడి నుంచి కనిపించడం మొదలుపెట్టింది డౌన్‌ఫాల్. ఎన్నికల ఫలితాలప్పుడే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి. ఆ తరువాత…