సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం,అలాగే సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా కొంతమేరకు నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అందుకు నిదర్శనమే తాజాగా విజయవాడలో జరిగిన ఓ ఘటన.
కె.డి.సి.సి. బ్యాంక్ విశ్రాంత ఉద్యోగి చలసాని పూర్ణ చంద్రరావు అనే 74 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటలు పాటు వేధించారు. వారి ఒత్తిడికి భయపడి సదరు విశ్రాంత ఉద్యోగి.. KDCC బ్యాంకు విజయవాడ బ్రాంచ్‌లో గల తన డిపాజిట్లను రద్దు చేసుకుని దాదాపు 12 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేయాలని బ్యాంక్ సిబ్బందిని అడిగాడు. దాంతో వెంటనే అక్కడి బ్రాంచ్ బ్యాంకు మేనేజర్‌కు అనుమానం వచ్చి.. ఆ వృద్ధుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన వినకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో వెంటనే బ్యాంక్‌కు చేరుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు విశ్రాంత ఉద్యోగికి నచ్చజెప్పి అవగాహన కల్పించడంతో పాటు సైబర్ వల నుంచి బయటపడేలా చేశారు. బ్యాంకు అధికారులు సత్వరమే స్పందించి ఒక నేరం జరగకుండా చూసుకున్నందుకు బ్యాంకు సిబ్బందిని సత్కరించి నగర పోలీస్ కమిషనర్ అభినందనలు చెప్పారు. సైబర్ నేరాలు జరగకుండా ఉండాలంటే బ్యాంక్ అధికారుల సహకారం ఎంతో అవసరం అని, ఈ విధంగా ప్రతి బ్యాంకు అధికారి తన బ్యాంకుకు కంగారుగా వచ్చిన వ్యక్తులు తమ ఖాతాల నుంచి వేరొకరి కరెంటు ఖాతాలకు అధిక మొత్తంలో డబ్బులు పంపిస్తుండగా.. వారిని ఆపాలని కోరారు. ఇలా చేయడం ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చని పోలీసులు తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal