ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారిని బలి తీసుకుంది. స్కూల్ బస్సు దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. దీంతో నల్లగొండలో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.
నల్గొండ పట్టణానికి చెందిన రాధిక అనే మహిళకు జశ్విత అనే ఐదేళ్ల కూతురు ఉంది. స్థానిక దేవరకొండ రోడ్డులోని మాస్టర్ మైండ్ స్కూల్‌లో జశ్విత ఎల్‌కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే తన కూతురిని పాఠశాలకు రెడీ చేసి పంపించింది రాధిక. బస్సు ఎక్కుతూ ఆ చిన్నారి బై.. బై.. అంటూ తల్లికి టాటా చెప్పింది. స్కూల్ ఆవరణలోకి బస్సు వెళ్లగా.. చిన్నారులు ఒక్కొక్కరిగా కిందకు దిగుతున్నారు. ఈలోగా జరగరాని ప్రమాదం జరిగింది. బస్సు దిగుతూ వెళ్తున్న చిన్నారులపైకి డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు నడిపాడు. జశ్విత స్కూల్ బస్సు ముందు వీల్ కింద పడిపోయింది. హుటాహుటినా జస్వితను ప్రౌజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ చిన్నారి చనిపోయిందని బాలిక తల్లి రాధిక ఆరోపిస్తోంది. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి స్కూల్ బస్సులకు శిక్షణ పొందని డ్రైవర్‌లను పెడుతున్నారని మండిపడ్డారు. కానీ ఈ బస్సులో ఆయాలు లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి జస్విత చనిపోయిందని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ విజయ్‌ను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యాశాఖ విచారణ జరుపుతోంది.