భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు.
ఓ దొంగల ముఠా కాపుకాసి ఏకంగా దేవుడి గుడిలోనే చోరీ చేశారు. భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు. ఈ విచిత్ర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని నెల క్రితం ఓ ఆలయంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెరువుకట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో నెల రోజుల క్రితం చోరీ జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు గుళ్లోకి ప్రవేశించి.. హుండీని ఎత్తుకెళ్లారు. అయితే నెల రోజులు గడిచాక ఏం జరిగిందో తెలియదుగానీ చోరీ చేసిన నగదును ఓ సంచిలో ఉంచి.. గుడి ఆవరణలో ఉంచి వెళ్లారు. చోరీ చేసిన నగదుతో పాటు ఓ లేఖను కూడా దొంగలు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. ఉదయం పూజాదికార్యక్రమాల కోసం గుడి చెరచిన పూజారికి.. గుడి ఆవరణలో డబ్బుల మూట కనిపించింది. అక్కడే ఉన్న లేఖను విప్పి చూడగా.. గుడి హుండీలో డబ్బు దొంగిలించడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారని, తప్పై పోయిందని లేఖలో పేర్కొన్నారు. ఇక దొంగలు తిరిగి తెచ్చిన డబ్బును ఆలయ నిర్వాహకులు లెక్కించగా.. మొత్తం రూ.1,86,486 ఉన్నట్లు గుర్తించారు.
అమ్మవారి మహత్యం వల్లే దోచుకెళ్లిన నగదును దొంగలు తిరిగి తీసుకొచ్చి తెచ్చిపెట్టారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. స్థానికంగా చోటు చేసుకున్న ఈ ఆసక్తికర సంఘటన చుట్టు పక్కల టాక్ ఆఫ్ ది టైన్‌గా మారింది.