ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలకు చెక్..

దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. ధర తక్కువ ఉండటం, అన్నీ చోట్లకు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైల్వే బలోపేతానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రైలు ప్రయాణీకుల భద్రత, భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌ల పరిధిలోని అన్ని ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,782 కోచ్‌లు, ఇందులో 895 లింకే హాఫ్‌మన్ బుష్, 887 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్‌లు ఉన్నాయి. లక్షలాది మంది ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.

దశలవారీగా సీసీటీవీల ఏర్పాటు

సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను దశలవారీగా అమలు చేయనున్నారు. మొదటి దశలో కొన్ని ముఖ్యమైన రైళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రయాగ్‌రాజ్-డాక్టర్ అంబేద్కర్ నగర్ ఎక్స్‌ప్రెస్, కాళింది ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్-లాల్‌గఢ్ ఎక్స్‌ప్రెస్, సుబేదార్‌గంజ్-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్, సుబేదార్‌గంజ్-మీరట్ సిటీ సంగం ఎక్స్‌ప్రెస్, సుబేదార్‌గంజ్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా రైళ్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రీమియం రైళ్లు అయిన ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్, శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్‌లలో మరింత అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలను అమర్చనున్నారు. ఈ సాంకేతికత అనుమానాస్పద కార్యకలాపాలను త్వరగా గుర్తించి అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తుంది. దీంతో అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు.

ప్రతి కోచ్‌లోనూ నిఘా

నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి కోచ్‌లోనూ కెమెరాలను అమర్చనున్నారు. ప్రతి ఏసీ కోచ్‌లో నాలుగు అధిక నాణ్యత గల కెమెరాలను ఏర్పాటు చేస్తారు. జనరల్ కోచ్‌లు, ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లు, ప్యాంట్రీ కార్లు మొదలైన వాటిలో ఒక్కో దానిలో ఆరు కెమెరాలను అమర్చనున్నారు. ఈ కెమెరాలు గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కూడా స్పష్టమైన వీడియోలను రికార్డు చేయగలవు. అంతేకాకుండా తక్కువ లైటింగ్‌లో కూడా బాగా పనిచేస్తాయి. కోచ్‌ల ప్రవేశ ద్వారాలు, కారిడార్‌లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రయాణీకుల కదలికలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు.

నిరంతర పర్యవేక్షణ

ఈ కెమెరాల ఫుటేజ్‌ను రియల్ టైమ్‌లో ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్‌లోని ఎన్‌సీఆర్ ప్రధాన కార్యాలయం, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయాలలో నిరంతరం పర్యవేక్షించనున్నారు. తద్వారా ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. “ఈ చర్య రైల్వేలు సురక్షిత ప్రయాణం పట్ల ఎంత అంకితభావంతో ఉన్నాయో తెలియజేస్తుంది. ఇది అక్రమ కార్యకలాపాలను నిరోధించడంలో, సత్వర దర్యాప్తులో సహాయపడుతుంది” అని ఎన్‌సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు.

భారతీయ రైల్వేలలో పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్య, మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా, ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సీసీటీవీల ఏర్పాటు నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణీకుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ చర్య రైల్వేల డిజిటల్ పరివర్తన ప్రణాళికకు అనుగుణంగా ఉందని, ఇది ఆధునిక, సురక్షితమైన రైలు నెట్‌వర్క్‌ను నిర్మించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అధికారులు చెబుతున్నారు.


About Kadam

Check Also

6జీ వచ్చేస్తుందోచ్.. ఆకాశమే హద్దుగా సిగ్నల్స్.. IIT హైదరాబాద్ ఘనత..!

IIT హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 7 GHz బ్యాండ్‌లో 6G ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 6G టెక్నాలజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *