అభివృద్ధి విషయంలో తరతమ భేదాలు చూడకూడదని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ మాటను ఆచరించి చూపి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలంలోని సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టిన 4 లేన్ల రోడ్డు నిర్మాణ పనుల వేళ.. తన ఇంటి ఇంటి ప్రహరీ అడ్డు రావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే కూల్చేయాలని ఆదేశాలిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలోని మొత్తం 43 ఇళ్లను పాక్షికంగా కూల్చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే సీఎం ఆదేశాలతో.. కొండారెడ్డిపల్లిలో రెండు రోజుల క్రితం అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. దీనిపై అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ, విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి పరిహారం అందించాలని 2 నెలల క్రితమే సీఎం తమను ఆదేశించారని, ఆ ఆదేశాల మేరకే రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు వివరించారు.
కాగా.. రెండు రోజుల క్రితం అధికారులు ముఖ్యమంత్రి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయడంతో.. ప్రస్తుతం ఆ గోడ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. ఈ విషయంలో గ్రామస్థులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. సీఎం అయినప్పటికీ.. ఎలాంటి బేధం లేకుండా.. గోడను కూల్చేయాలని అధికారులకు ఆదేశాలివ్వడం.. గ్రేట్ అంటూ అభినందిస్తున్నారు.