హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో నివసిస్తున్న అవిభక్త కవలలు వీణా, వాణి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ కలిసే ఉన్న ఈ ఇద్దరూ చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇటీవల డిగ్రీలో డిస్టింక్షన్ సాధించి ఇప్పుడు ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు కంప్లీట్ చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం తాము ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవడంతో.. సీఏ చేయాలని నిర్ణయించుకున్నట్లు వీణా-వాణిలు చెబుతున్నారు.
ఈ అభివక్త కవలల రోజు ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. తొలుత తెలుగు, ఇంగ్లీషు పేపర్స్ చదువుతారు. సాయంత్రం వరకు గురువుల సహాయంతో చదువుకుంటారు. ఎల్లప్పుడూ సంరక్షకులు తోడుగా ఉంటారు. చదువు పూర్తయిన తర్వాత బోర్డ్ గేమ్స్ ఆడి, బొమ్మలు వేసుకుంటారు. రంగుల ఎంపికపై ఇద్దరూ చర్చించుకుంటారు. రాత్రి భోజనం చేసిన తర్వాత టీవీలో వార్తలు చూస్తారు. రాత్రి పది గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు.
మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం, స్వామి వివేకానందుల జీవిత చరిత్రలు తమకు స్ఫూర్తి అని వీణా-వాణిలు చెబుతున్నారు. శిశువిహార్‌లో తల్లిలా తమను చూసుకునే సఫియా మేడం సూచనతో వారు ఈ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశారట. వారి ప్రసంగాలు తమను ఎంతో ఇన్‌స్పైర్ చేస్తాయి అంటున్నారు. తెలుగు నవలలు, స్టోరీలు కూడా చదువుతున్నారు. ఇంగ్లీషులో మాట్లాడటానికి ప్రతిరోజూ అరగంట ప్రాక్టీసు చేస్తున్నారు.
డిగ్రీలో ముఖ్యమైన సబ్జెక్టులు బోధించిన యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ ఏజీఎం సుధాకర్ గారికి వీరు కృతజ్ఞతలు తెలిపారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రత్యేక సంరక్షణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సదా రుణపడి ఉంటామని అంటున్నారు. కాగా అక్టోబరు 16వస్తే ఈ కవలలు 23వవసంతంలోకి అడుగుపెడతారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మారగాని మురళీ-నాగలక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు. రెండో సంతానంగా అవిభక్త కవలలుగా జన్మించారు వీణవాణి. వీళ్లకు అక్క, చెల్లి కూడా ఉన్నారు. 2003 అక్టోబర్ 16న జన్మించారు వీణావాణి. పుట్టినప్పట్నించీ 13 ఏళ్ల పాటు హైదరాబాదులోని నీలోఫర్ హాస్పిటల్లోనే ఉన్నారు. జన్మదినమైనా, ఏ కార్యక్రమమైనా ఆస్పత్రే ఫంక్షన్‌హాల్. డాక్టర్లు, సిబ్బందే అతిధులు. ఆ తర్వాత వారిని శిశువిహార్, స్టేట్ హోంకు తరలించి.. సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు.