హిమాచల్ ప్రదేశ్ లోని వరదలు, వర్షాల ప్రభావిత ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. కాంగ్రాలో సమావేశం ద్వారా ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించి ప్రమాద నష్టాన్ని అంచనా వేశారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయి. వరదలు బీభత్సానికి ఆయా రాష్ట్రాలు తీరని నష్టాన్ని చవిచూశాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా చాలా వరకు ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏరియల్ వ్యూ ద్వారా హెలికాప్టర్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను సమీక్షించడానికి, జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కాంగ్రాలో అధికారిక సమావేశం నిర్వహించారు.ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలకు రూ. 1500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
అలాగే వరదల కారణంగా మృతి చెందిన కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. బాధిత కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని, ప్రజలను తిరిగి తమ కాళ్లపై నిలబెట్టడానికి బహుముఖ దృక్పథాన్ని తీసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను పునర్నిర్మించడం, జాతీయ రహదారుల పునరుద్ధరించడం, పాఠశాలలను పునర్నిర్మించడం, పశువులకు మినీ కిట్లను విడుదల చేయడం వంటి అనేక మార్గాల ద్వారా వీటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వవలసిన కీలకమైన అవసరాన్ని గుర్తించి, ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్లు లేని రైతులకు అదనపు సహాయం అందించాలని ఆయన సూచించారు.
రాష్ట్రాలకు ముందస్తు చెల్లింపులు సహా విపత్తు నిర్వహణ నియమాల కింద అన్ని సహాయాలను అందిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వరదల సమయంలో సహాయక చర్యలను చేపట్టిన NDRF, SDRF, సైన్యం, రాష్ట్ర పరిపాలన, ఇతర సేవా ఆధారిత సంస్థల సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. రాష్ట్రం మెమోరాండం, కేంద్ర బృందాల నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అంచనాను మరింత సమీక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.