మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే 4 విడతలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టినా ఇంకా ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోలేదు. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను..
రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే 4 విడతలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టినా ఇంకా ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోలేదు. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబరు 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
సీఎం చంద్రబాబు టైం టేబుల్‌ను బట్టి సెప్టెంబరు 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా ఇప్పటికే విడులైంది. మూడో విడతలోనూ ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్తవారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా కొలిక్కివస్తే.. క్లారిటీవచ్చే అవకాశం ఉంది.
ఇక తుది ఎంపిక జాబితాను రూపొందించి సెప్టెంబర్ 12వ తేదీన వెబ్‌సైట్‌లో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు అవుతుంది. కాగా రాత పరీక్ష అనంతరం రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్క పోస్టుకు ఒక్క అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. కొన్ని జిల్లాల్లో పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 700 వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది. మిగిలిపోయిన పోస్టులను వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.