పుస్తెలు అమ్మి కొని తిందామన్న పులస దొరకడం లేదు. కొందరైతే పులస దొరికితే తమకే ఇవ్వాలని.. రేటు ఎంతైనా పర్లేదని జాలర్లకు అడ్వాన్సులు ఇస్తున్నారు. సీజన్ ఎండింగ్‌కి వచ్చేసింది. ఇప్పటివరకు దొరికిన పులసలు అంతంత మాత్రమే. దీంతో ఇలసలకు డిమాండ్ పెరిగింది.
పులస దొరకడమే బంగారమైపోయింది. చాలు అరుదుగా మాత్రమే గోదావరి జలాల్లో దొరకుతున్నాయి ఈ అత్యంత రుచి కలిగిన ఖరీదైన చేపలు. దొరికే అరాకొర చేపలను దక్కించుకునేందుకు మాంసం ప్రియులు తెగ పోటీ పడుతున్నారు. ఫలితంగా కేజీ, కేజీన్నర చేపలు సైతం దాదాపు 25 నుంచి 30 వేల రూపాయలు పలుకుతున్నాయి. జూన్ నుంచి ఆగష్టు వరకు ఈ ఏడాది సీజన్‌లో కేవలం పదులు సంఖ్యలో ఈ చేపల దొరికాయంటే.. అవి మనకు దూరం అయిపోతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. పులసలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఒరిస్సా, బెంగాల్ నుంచి ఇలస చేపల్ను తెప్పించి.. వాటినే పులసల మాదిరిగా చెప్పి అమ్ముతున్నారు.
ముందుగా పులస, ఇలసకి తేడా ఏంటో తెలుసుకుదాం…..
గోదావరికి ఎర్ర నీరు వచ్చే క్రమంలో.. గుడ్లు పెట్టేందుకు ఒడిశాలో సముద్రం నుంచి ప్రయాణం మొదలెట్టి… ప్రవాహానికి ఎదురీదుతూ… మన నదీ జలాల్లోకి ప్రయాణించిన చేపను పులస అంటున్నారు. ఉప్పు నీటి నుంచి నది నీటికి మారి… ఇలా ఎదురీదడం కారణంగానే ఇలస కాస్త పులసగా మారుతుంది. దాని రుచి పెరుగుతుంది. సముద్రంలో పట్టే చేపల్ని ఇలస లేదా విలస అని పిలుస్తుంటారు.
కాగా ప్రస్తుతం మన దగ్గర పులస దొరకడం గగనం అయిపోవడంతో.. కొందరు చేసేది లేక ఇలస చేపల్ని కొని తినేస్తున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరగింది. అయితే తాజాగా ఆ ఇలసలను కూడా వేలం పాటలో దక్కించుకోవాల్సి రావడం దౌర్భాగ్యం. ప్రస్తుతం గోదావరి తీర ప్రాంతాల్లో జిల్లా కిలో ఇలస రూ.800 నుంచి రూ.1500లకుపైనే ధర పలుకుతోంది.