ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మెుదలైంది. ఇప్పటికే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 9) ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌లో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సెక్రెటరీలతో నీలం సాహ్ని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలు, కొత్త ఈవీఎంల కొనుగోలుపై విస్తృతంగా చర్చించారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు సీఈవో తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ స్థానిక ఎన్నికల్లో ఈవీఎం మిషన్లను వాడారని ఆమె గుర్తు చేశారు. ఇక ఈవీఎంల కొనుగోలు, వినియోగంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ వెల్లడించారు.
ఏపీలో ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది. 2026 జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. స్థానిక సంస్థల ఎన్నికలను 4దశల్లో నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ప్రకటించారు. గ్రామ పంచాయతీలలో 1,37,671 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల కోసం 41,301 కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయి. ఒక కంట్రోల్ యూనిట్‌కు రెండు బ్యాలెట్ యూనిట్లు అనుసంధానం చేయవచ్చు అని ఎస్ఈసీ నీలం సాహ్ని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు.
ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ః
* 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి.
* అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
* నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి.
* నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
* డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
* డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
* చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.