ప్రహారీ గోడ దూకి.. పొలాల వెంబడి విద్యార్థుల పరుగులు.. ఎందుకో తెలిస్తే షాక్.. !

వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో విద్యార్థులు పెద్ద సాహసానికే ఒడిగట్టారు. తమ పట్ల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తూ ఆటలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గురుకుల పాఠశాల గోడ దూకి.. పొలాల గట్లపై పరుగెత్తారు.

చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులంలో పదవ తరగతి విద్యార్థులు ఆందోళన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు సుమారు 80 మంది విద్యార్థులు మంగళవారం (సెప్టెంబర్ 9) రోజు ఉదయం ఒక్కసారిగా గురుకుల పాఠశాల ప్రహారీ గోడను దూకేశారు. పాఠశాలను అనుకోని ఉన్న పొలాల గట్లపై పరుగులు తీశారు. సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలని భావించారు. అయితే విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ తోటి ఉపాధ్యాయులును అప్రమత్తం చేసి విద్యార్థుల వెంట పరుగులు తీశారు. అలాగే పోలీసులతో పాటు చిట్యాల గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు, యువకులకు సమాచారం అందించారు. అయితే వారిని మార్గ మధ్యలోనే అడ్డు్కుని తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారు.

ఇక విద్యార్థుల ఆందోళన అంశాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను వెంటనే పాఠశాలకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు హుటాహుటిన చిట్యాల మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులానికి పరుగులు పెట్టారు. పాఠశాలలోని విద్యార్థులను కలిసి వారి సమస్యలను అడిగితే చెప్పలేదు. జిల్లా కలెక్టర్ వస్తేనే తమ సమస్యలను వెల్లడిస్తామని తేల్చిచెప్పారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాలకు వెళ్ళక తప్పలేదు.

నేరుగా గురుకులానికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. విద్యార్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువు ఒత్తిడితో తమకు ఆటలను దూరం చేశారని విద్యార్థులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఏదైనా సమస్య వస్తే వ్యక్తిగత తల్లిదండ్రులకు సమాచారం అందించి వారితో తిట్టిస్తున్నారని, లేనిపోని అభాండాలు తమపై వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేకాక తమను దుర్భాషలాడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు కల్పించాల్సిన వసతులను క్రమం తప్పకుండా అనుసరించేలా చర్యలు తీసుకోవాలని వారి భవిష్యత్తుకు మార్గదర్శకం ఉండేలా వ్యవహరించేలా సూచించారు.

ఇలా రోడ్లపై చేరే వరకు అజాగ్రత్త వహించడం సరైనది కాదని జిల్లా కలెక్టర్ మందలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి తీవ్రతరం కాకుండా సామరస్యంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా ఆర్ సి ఓ శ్రీనివాస్ గౌడ్, DCO శ్రీవేణిలకు సూచించారు. ప్రత్యేకంగా తమకు సమస్యలను విద్యార్థులు వివరించేలా ఫిర్యాదుల బాక్సును పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేసి వారిలో భరోసా నింపారు.

About Kadam

Check Also

ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ఇదే.. ఒక్కొక్కరికి రూ 15 వేలు..

ఏ రైతుకూ యూరియా కొరత రాకుండా నేను చూసుకుంటాను. ఎంత యూరియా కావాలో అంతే వాడండి. మనం అడిగిన వెంటనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *